పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీ స్టార్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ విశాఖలో తెలిపారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు…అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత పాలకులు చూపించినట్లుగా గ్రాఫిక్స్ చూపించమన్నారు. టూరిజం రంగానికి కూడా రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ. 200 కోట్లు కేటాయించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ ప్యాకేజీ లో భాగంగా టూరిజం లో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామన్నారు. మొత్తం రుణాలపై 9 శాతం వడ్డీ కాగా, అందులో 4.5 % ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.