టెన్షన్..టెన్షన్.. రేపు సుప్రీంలో లోకల్‌బాడీ ఎన్నికల కేసు విచారణ

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించడంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేలా కేసును జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ మేరకు బుధవారం నాటి కేసుల జాబితాలో ఈ కేసును చేర్చారు. […]

టెన్షన్..టెన్షన్.. రేపు సుప్రీంలో లోకల్‌బాడీ ఎన్నికల కేసు విచారణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 8:59 PM

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించడంతో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేలా కేసును జాబితాలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ మేరకు బుధవారం నాటి కేసుల జాబితాలో ఈ కేసును చేర్చారు. ఇదే కేసులో ఇంప్లీడ్ అవుతూ వేసిన మరో రెండు పిటిషన్లను కూడా కలిపి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తద్వారా ఈ కేసు విచారణలో కౌంటర్లు దాఖలు చేయడానికి నోటీసులివ్వాల్సిన అవసరం లేకుండానే ప్రతివాది సంసిద్ధమైంది.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష కూడా నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనాను ఒక సాకుగా వాడుకున్నారని, నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమని, ఎన్నికలు జరిగితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలకు ఊతమిచ్చినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును సైతం సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అయితే ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో చేర్చకపోవడంతో మంగళవారం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు కేసు ప్రాధాన్యతను వివరిస్తూ జాబితాలో చేర్చాల్సిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం బుధవారం నాటి జాబితాలో చేర్చింది.

ఇంప్లీడ్ కానున్న రాజకీయ పార్టీలు :

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ స్వాగతించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 6 వారాలు వాయిదా వేస్తే సరిపోదని, అసలు ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన సహా కమ్యూనిస్టు పార్టీలు కూడా కోరుతున్నాయి. నామినేషన్ల సందర్భంగా వైకాపా నేతలు ఇతర పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేశారని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల దాడులు కూడా జరిగాయని, ప్రత్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయని చెబుతున్నాయి. అతికష్టం మీద నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల అభ్యర్థులను బెదిరించి వాటిని ఉపసంహరించుకునేలా చేశారని కూడా కొందరు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఈ కేసులో చేరేందుకు తెలుగుదేశం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం విచారణ చేపట్టే సమయానికి ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్‌తో మరి కొన్ని పిటిషన్లు ఈ కేసుకు జతకలిసే అవకాశం ఉంది.