వరల్డ్ కప్ 2019: పసికూన ఆఫ్గన్‌పై ఇంగ్లాండ్ ఘనవిజయం

, వరల్డ్ కప్ 2019: పసికూన ఆఫ్గన్‌పై ఇంగ్లాండ్ ఘనవిజయం

ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లాండ్, ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారీ లక్ష్యఛేదనని ఆఫ్గనిస్తాన్ ఈదలేకపోయింది . 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్ చతికల పడ్డారు. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో ఆప్గనిస్తాన్ ను ఓడించింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్స్‌లో  ఓపెనర్ జద్రాన్ డకౌట్ కాగా, గుల్బదీన్ నయిబ్(37), రహ్మత్ షా(46), షహీదీ (76), అస్గర్ అఫ్గన్(44) క్రీజులో నిలబడి గౌరవ ప్రదమైన స్కోరు సాధించేందుకు చెమటోడ్చారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ 247/8 పరుగులు చేసి విజయానికి 150 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఒక రకంగా దండయాత్ర చేశారనే చెప్పాలి.. నిర్ణీత 50 ఓవర్లకు ఇంగ్లాండ్ 397/6 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లో ఇయాన్ మోర్గాన్ కేవలం 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. మోర్గాన్ సాధించిన స్కోరులో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. దీంతో మోర్గాన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డు స్థాపించాడు. మోర్గన్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ, ఏబీ డివిలీర్స్, క్రిస్ గేల్ 16 సిక్సర్లు బాది రెండో స్థానంలో సంయుక్తంగా ఉన్నారు. కాగా మొత్తం ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 25 సిక్సర్లు బాదారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో(90), జేమ్స్(26) శుభారంభం ఇవ్వడానికి తోడు..మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో.. 35 ఓవర్ల వద్ద ఇంగ్లాండ్ స్కోరు 200 పరుగులు దాటగా, 45 ఓవర్ కు ఏకంగా 325 పరుగులకు చేరుకుంది. అంటే పది ఓవర్లలో దాదాపు 125 పరుగులు నమోదయ్యాయి. మోర్గాన్ కు తోడుగా రూట్ కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆఫ్గన్ బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. ఐపిఎల్‌లో సత్తా చాటిన రషీద్ ఖాన్ తన స్పెల్ లో ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మహ్మద్ నబీ కూడా 70 పరుగులు ఇచ్చాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *