తిప్పతీగ.. సిటీలలో ఉండేవాళ్లకు దీని గురించి తెలియకపోయినా.. పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. సైన్స్ పరంగా కూడా ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తిప్పతీగకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో కరోనా కారణంగా చాలామంది కొలువులు కోల్పోతుంటే.. తిప్పతీగతో రూ.కోట్ల కాంట్రాక్టుతో వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఓ యువ గిరిజన వ్యాపారి. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన సునీల్ పవార్ అనే యువకుడు తిప్పతీగ సరఫరా కోసం పేరొందిన సంస్థలతో రూ.1.5కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అంతేకాదు.. తన వ్యాపారం ద్వారా వందల మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నాడు.
షాహ్‌పుర్ తాలుకాలోని ఖరిద్కు చెందిన సునీల్‌కు.. స్థానిక అడవుల్లో లభించే ఔషధ గుణాలున్న మొక్కలపై మంచి పెద్దల ద్వారా అవగాహన ఏర్పడింది. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో తిప్పతీగ బాగా ఉపయోగపడుతుందని అతడు తెలుసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం దానిని సేకరించి.. కంపెనీలకు అందించే వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా కట్కరీ తెగకు ఉపాధి కల్పిస్తూ ప్రధానమంత్రి వన్‌ధన్ పథకం సాయంతో వన్‌ధన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఏడాదికి రూ.3 నుంచి రూ.5 లక్షలు సంపాదించేవాడు. కరోనా మహమ్మారి కారణంగా తిప్పతీగకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో డాబర్, బైద్యనాథ్, హిమాలయ వంటి సంస్థలకు 350 టన్నుల తిప్పతీగ సరఫరా చేసేందుకు అతడు ఏకంగా రూ.1.57కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నాడు. ప్రస్తుతం షాహ్పుర్లోనే సునీల్‌కు 6 వన్‌ధన్ కేంద్రాలున్నాయి. ఆయుర్వేదంలో తిప్పతీగను విరివిగా వాడతారు. హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది.
Also Read: తెలంగాణలో అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదు.. సడలింపుల వివరాలు ఇలా ఉన్నాయి