
పరిస్థితికి తగ్గట్లుగా స్వభావం మార్చే మనుషులను ఊసరవెల్లితో పోల్చడం మనకు అలవాటే. చుట్టూ ఉండే పరిసరాల రంగుల్లో కలిసిపోయి శత్రువుల నుంచి తప్పించుకోవడానికే ఊసరవెల్లి రంగులు మారుస్తుందని చిన్నప్పటి నుంచి చాలామంది నమ్ముతుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతోందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక అసలు ఉద్దేశం దాక్కోవడం మాత్రమే కాదు.. దాని వెనుక సంక్లిష్టమైన భౌతికశాస్త్రం, భావోద్వేగాలు దాగి ఉన్నాయి. అంతేకాదు దాని 360 డిగ్రీల కంటిచూపు, బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే నాలుక వెనుక ఉన్న అద్భుత శక్తులు జంతు ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనవి.
ఊసరవెల్లి రంగులు మార్చడం కేవలం శత్రువుల నుంచి దాక్కోవడానికి కాదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. రంగు మార్పు వెనుక ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయి.
ఊసరవెల్లి తన తోటి జీవులతో మాట్లాడటానికి రంగులను ఒక భాషలా వాడుతుంది. భయం, కోపం వచ్చినప్పుడు లేదా ప్రత్యర్థి మగ ఊసరవెల్లితో పోరాడాల్సి వచ్చినప్పుడు ముదురు నలుపు, ఎరుపు రంగుల్లోకి మారుతుంది. అదే ఆడ ఊసరవెల్లిని ఆకర్షించాలనుకున్నప్పుడు ప్రకాశవంతమైన రంగులను ప్రదర్శిస్తుంది.
ఇవి శీతల రక్త జీవులు కావడంతో శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకోలేవు. చలిగా అనిపించినప్పుడు సూర్యరశ్మిని ఎక్కువగా పీల్చుకోవడానికి ముదురు రంగుల్లోకి, తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు వేడిని ప్రతిబింబించడానికి లేత రంగుల్లోకి చర్మాన్ని మార్చుకుంటాయి.
గతంలో చర్మంలోని పిగ్మెంట్ కణాలు విస్తరించడం వల్లే రంగు మారుతుందని భావించేవారు. కానీ స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న అసలైన సైన్స్‌ను ఛేదించారు. ఊసరవెల్లి చర్మం పైపొరల కింద ఇరిడోఫోర్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. వీటిలో అతి సూక్ష్మమైన గ్వానైన్ నానో క్రిస్టల్స్ అమరి ఉంటాయి. ఊసరవెల్లి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ స్పటికాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు అవి నీలి రంగు కాంతిని పరావర్తనం చేస్తాయి. చర్మంలోని పసుపు పిగ్మెంట్‌తో ఇది కలిసి ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఊసరవెల్లి ఉద్రేకం లేదా భయానికి గురైనప్పుడు చర్మ కణాలు సాగి, ఆ స్పటికాల మధ్య దూరం పెరుగుతుంది. దాంతో అవి పసుపు, నారింజ, ఎరుపు వంటి పొడవైన తరంగదైర్ఘ్యం గల కాంతిని పరావర్తనం చేస్తాయి. అంటే ఇది ఒక రకంగా కాంతి పరావర్తన భౌతికశాస్త్ర అద్భుతం.
ఊసరవెల్లి కంటి నిర్మాణం ప్రకృతిలో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీని రెండు కళ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేర్వేరు దిశల్లో తిరగగలవు. ఒక కంటితో ముందున్న ఆహారాన్ని చూస్తూనే, మరో కంటితో వెనుక ఏదైనా శత్రువు వస్తుందేమో గమనించగలదు. వేటాడే సమయంలో రెండు కళ్లను ఒకే దిశకు తిప్పి, ఎర ఎంత దూరంలో ఉందో అత్యంత కచ్చితత్వంతో ‘డెప్త్ పర్సెప్షన్’ ద్వారా అంచనా వేస్తుంది.
ఊసరవెల్లి నడక చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ, వేట మాత్రం మెరుపు వేగంతో సాగుతుంది. ఊసరవెల్లి నాలుక దాని శరీర పొడవు కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. నోటిలోని స్ప్రింగ్ లాంటి కొల్లాజెన్ కణజాలం సహాయంతో సెకనులో వందో వంతు సమయంలో నాలుకను బయటకు విసురుతుంది. ఇది ఫైటర్ జెట్ త్వరణం కంటే వేగంగా దూసుకెళ్తుంది. నాలుక కొన భాగం ఒక జిగురు ముద్దలా, వాక్యూమ్ కప్ లా పనిచేసి ఎంతటి వేగవంతమైన కీటకాన్నైనా క్షణాల్లో ఒడిసిపట్టి నోట్లోకి లాగేసుకుంటుంది.