కరెంట్ వైర్లపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు..? అసలు కారణం ఇదే..

మనం పొరపాటున కరెంట్ వైర్‌ను తాకితే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కానీ, వేల వోల్టుల విద్యుత్ ప్రవహించే తీగలపై కాకులు, పావురాలు ఎంచక్కా గంటల తరబడి ఎలా కూర్చుంటున్నాయి? వాటికి షాక్ కొట్టదా? లేక వాటి ఒంట్లో ఏదైనా సూపర్ పవర్ ఉందా? దీని వెనుక ఉన్న షాకింగ్ సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కరెంట్ వైర్లపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు..? అసలు కారణం ఇదే..
Why Dont Birds Get An Electric Shock

Updated on: Apr 03, 2026 | 3:38 PM

మనం రోజూ బయట చూస్తుంటాం.. హైవోల్టేజ్ విద్యుత్ తీగలపై కాకులు, పావురాలు ఎంచక్కా గంటల తరబడి కూర్చుంటాయి. మనిషి పొరపాటున ఆ తీగను తాకితే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కానీ పక్షులకు మాత్రం ఏమీ కాదు. అసలు విద్యుత్ తీగలు పక్షులను ఏమీ చేయవా? వాటి శరీరంలో అంత శక్తి ఉందా? అంటే దీన్ని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. విద్యుత్ ప్రవహించాలంటే ఒక మార్గం అవసరం. విద్యుత్ ఎప్పుడూ తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి భూమిని చేరుకోవాలని చూస్తుంది. పక్షి కేవలం ఒకే ఒక తీగపై రెండు కాళ్లను ఉంచి కూర్చున్నప్పుడు, విద్యుత్ పక్షి శరీరం ద్వారా ఎక్కడికీ వెళ్లలేదు. అంటే అక్కడ సర్క్యూట్ పూర్తి కాలేదు. దీనివల్ల విద్యుత్ పక్షి శరీరం గుండా ప్రవహించకుండా నేరుగా తీగ ద్వారానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

పొటెన్షియల్ తేడా లేకపోవడం

విద్యుత్ ఎప్పుడూ ఎక్కువ వోల్టేజీ ఉన్న చోటు నుండి తక్కువ వోల్టేజీ ఉన్న చోటికి ప్రవహిస్తుంది. పక్షి రెండు కాళ్లు ఒకే తీగపై ఉన్నప్పుడు, ఆ రెండు కాళ్ల వద్ద వోల్టేజీ సమానంగా ఉంటుంది. దీన్నే జీరో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఈ తేడా లేకపోవడం వల్ల విద్యుత్ పక్షి శరీరంలోకి ప్రవేశించదు.

పక్షులు మంచి వాహకాలు కావు

సాధారణంగా విద్యుత్ ప్రవహించాలంటే ఆ వస్తువు మంచి వాహకం అయి ఉండాలి. పక్షుల శరీరంలోని కణాలు, కండరాలు విద్యుత్ ప్రవాహానికి కొంత వరకు అడ్డుపడతాయి. తీగలో ఉండే రాగి పక్షి శరీరం కంటే కోటి రెట్లు మెరుగైన వాహకం. అందుకే విద్యుత్ పక్షి శరీరం వైపు వెళ్లకుండా రాగి తీగ ద్వారానే వెళ్లడానికి మొగ్గు చూపుతుంది.

పక్షులకు షాక్ ఎప్పుడు తగులుతుంది..?

అయితే పక్షులకు అసలు షాక్ కొట్టదు అనుకుంటే పొరపాటే.

రెండు తీగలను తాకినప్పుడు: పక్షి ఒకేసారి రెండు వేర్వేరు వోల్టేజీలు ఉన్న తీగలను తాకినప్పుడు సర్క్యూట్ పూర్తవుతుంది. అప్పుడు విద్యుత్ పక్షి శరీరం గుండా ప్రవహించి షాక్ కొడుతుంది.

భూమిని తాకినప్పుడు: ఒక కాలు తీగపై ఉండి, పక్షి శరీరం విద్యుత్ స్తంభానికి లేదా భూమికి తగిలితే వెంటనే సర్క్యూట్ క్లోజ్ అయి పక్షి మరణిస్తుంది.

వాహక పదార్థాలను తెచ్చినప్పుడు: పక్షులు తమ గూడు కోసం ఇనుప తీగలు లేదా తడి పుల్లలు వంటి విద్యుత్ వాహకాలను నోటితో పట్టుకుని తీగలపై వాలినప్పుడు అవి రెండో తీగకు లేదా స్తంభానికి తగిలితే షాక్ తగిలే ప్రమాదం ఉంది.

పక్షులకు షాక్ తగలకపోవడానికి కారణం వాటి శక్తి కాదు.. అవి కూర్చునే పద్ధతి, భౌతిక శాస్త్ర సూత్రాలు. కేవలం ఒకే తీగపై ఉండటం వల్లే అవి సురక్షితంగా ఉన్నాయి.

Follow Us