
కుమార్తెలు కుటుంబానికి గర్వకారణమని, తల్లిదండ్రులకు అండగా నిలిచే దేవతలని తరచూ చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఈ మాటలను అక్షరాలా నిజం చేసింది. ఫాదర్స్ డేకు కేవలం వారం రోజుల ముందు ఇద్దరు కూతుళ్లు తమ తండ్రికి పునర్జన్మ ప్రసాదిస్తూ అపూర్వ త్యాగానికి నిదర్శనంగా నిలిచారు. ఒకరు తన కిడ్నీని, మరొకరు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి తండ్రికి కొత్త జీవితం ప్రసాదించారు.
ఘజియాబాద్‌లోని మోర్టా గ్రామానికి చెందిన 45 ఏళ్ల జయంత్ త్యాగి, గతంలో బీజేపీ సెక్టార్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. సాధారణ జీవితం గడుపుతున్న ఆయన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో ఆయన కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తేలింది. వెంటనే అవయవ మార్పిడి చేయకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు.
ఈ వార్త కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసినా, ఆయన ఇద్దరు కుమార్తెలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమార్తె రిషిక త్యాగి తన తండ్రికి ఒక కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. మరికొన్ని నెలల్లో ఆమె వివాహం జరగబోతోంది. అయినప్పటికీ తన తండ్రి ప్రాణాల కంటే మరేదీ ముఖ్యమేమీ కాదని భావించింది. తన నిర్ణయాన్ని కాబోయే అత్తమామలకు తెలియజేయగా, వారు కూడా ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ఇక బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న చిన్న కుమార్తె ఖుషీ త్యాగి కూడా వెనుకడుగు వేయలేదు. తండ్రిని కాపాడేందుకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులు మొదట్లో వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై ఆందోళన చెందినా, “నాన్న ఉంటేనే మా ప్రపంచం ఉంటుంది” అనే కుమార్తెల మాటలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి.
నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల బృందం సుదీర్ఘంగా, అత్యంత క్లిష్టంగా సాగిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. పలువురు కుటుంబ సభ్యుల పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఇద్దరు కుమార్తెల అవయవాలే సరిపోవడంతో వైద్యులు మార్పిడి ప్రక్రియ చేపట్టారు.
ప్రస్తుతం జయంత్ త్యాగి సహా ఆయన ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తండ్రి కోసం తమ శరీరంలోని అవయవాలను దానం చేసి ప్రాణాలను కాపాడిన ఈ ఇద్దరు కుమార్తెల ధైర్యం, ప్రేమ, త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఫాదర్స్ డేకు ముందు తండ్రికి వారు ఇచ్చిన ఈ అపురూపమైన కానుక నిజంగా జీవితాంతం గుర్తుండిపోయే బహుమతిగా నిలిచిపోయింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..