
ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. ఇది తన భయపెట్టే స్వభావంతో మనుషులను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. 1836లో శాస్త్రవేత్తలు దీని గురించి మొదటిసారి తెలుసుకున్నప్పటికీ, ఇటీవల ప్రముఖ సరీసృపాల శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ శంకర్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల అనంతరం దీనికి నాలుగు విభిన్న జాతులు ఉన్నాయని కనుగొంది.
డీఎన్‌ఏ అధ్యయనం ద్వారా గుర్తించిన ఈ జాతులు ఒఫియోఫాగస్ కలింగ(పశ్చిమ కనుమలు), ఒఫియోఫాగస్ హన్నా (తూర్పు పాకిస్థాన్, ఉత్తర, ఈశాన్య భారత్), ఒఫియోఫాగస్ బంగారస్ (భారత్-చైనా ప్రాంతాలు), ఒఫియోఫాగస్ సాల్వటానా (ఇండో-మలేషియా, ఫిలిప్పీన్స్). గతంలో భారత్‌లో ఒఫియోఫాగస్ హన్నా మాత్రమే ఉంటుందని భావించేవారు. కానీ, పశ్చిమ కనుమల్లో స్థానిక పేరుతోనే ఒఫియోఫాగస్ కలింగ అనే ప్రత్యేక జాతిని కనుగొనడం కీలకమైన పరిశోధన. ఈ జాతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కింగ్ కోబ్రా, సాధారణ కోబ్రా పూర్తిగా వేర్వేరు జాతులకు చెందినవి. కింగ్ కోబ్రా ఒఫియాఫగాస్ వంశానికి చెందగా, సాధారణ కోబ్రా నాజా వంశానికి చెందినది. వాటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆవాసాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
సాధారణ కోబ్రాలు వ్యవసాయ పొలాలు, పట్టణ ప్రాంతాలు, జనసాంద్రత గల ప్రదేశాల్లో కనిపిస్తాయి. అయితే, కింగ్ కోబ్రాలు దట్టమైన అడవుల్లో, ఎత్తైన ప్రాంతాల్లో, జన సంచారం తక్కువగా ఉండే చోట్ల నివసిస్తాయి. అలాగే ఈ కోబ్రాలు గుడ్లను కాపాడినప్పటికీ, ప్రత్యేక గూడును నిర్మించవు. కానీ, కింగ్ కోబ్రాలు విచిత్రమైన, సంక్లిష్టమైన గూడును నిర్మించి, అందులో గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇక సాధారణ కోబ్రాలు ఎలుకలు, కప్పలు, ఉడుతలు, పక్షులు వంటి చిన్న జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కింగ్ కోబ్రాలు మాత్రం ఇతర పాములను తింటాయి. వాటి ఆహారంలో కోబ్రా, క్రేట్, వైపర్ వంటి విషపూరిత పాములతో పాటు ఇతర రకాల పాములు కూడా ఉంటాయి.
భారత్‌లో పాముకాటు సమస్య కూడా తీవ్రమైనది. బిగ్ ఫోర్గా పిలిచే భారత కోబ్రా, భారత క్రేట్, రసెల్ వైపర్, సా స్కేల్డ్ వైపర్ దేశంలో పాముకాటు మరణాలకు దాదాపు 90 శాతం కారణమని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.ఎస్. మనోజ్ తెలిపారు. పాముకాటుకు చికిత్స అందించడంలో ప్రధాన సమస్య తగినన్ని ప్రత్యేక ఔషధాలు అందుబాటులో లేకపోవడమే. ప్రస్తుతం ఒకే ఔషధాన్ని నాలుగు రకాల పాముకాట్లకు వినియోగిస్తున్నారు. కింగ్ కోబ్రా కాటుకు భారతదేశంలో ప్రత్యేక ఔషధం ఏదీ లేదని డాక్టర్ గౌరీ శంకర్ స్పష్టం చేశారు.