నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

చేపల్లా నీటిలో ఈత కొట్టడం మనిషికి తెలుసు.. పక్షుల్లా ఆకాశంలో ఎగరడం మనిషికి తెలుసు.. కానీ నీటిపై మునిగిపోకుండా మ్యాజిక్ చేసినట్లు పరిగెత్తడం మనిషికి సాధ్యమా? అస్సలు కాదు.. కానీ ప్రకృతి సృష్టిలో ఒక వింత జీవికి మాత్రం ఇది వెన్నతో పెట్టిన విద్య. శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయి దీనికి జీసస్ క్రైస్ట్ లిజార్డ్ అని పేరు పెట్టారు. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..
Basilisk Lizard Walking On Water

Updated on: Feb 25, 2026 | 10:08 PM

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా పరిగెత్తడం మాత్రం మనిషికి ఇప్పటికీ అందని ద్రాక్షే. అయితే ఈ ప్రపంచంలో ఒక జీవికి మాత్రం నీటిపై నడిచే అద్భుత శక్తిని ప్రకృతి ప్రసాదించింది. అదే బాసిలిస్క్ బల్లి. బైబిల్ కథల ప్రకారం.. జీసస్ క్రైస్ట్ నీటిపై నడిచారని చెబుతారు. సరిగ్గా అదే విధంగా ఈ బల్లి కూడా నీటిపై మునిగిపోకుండా పరిగెత్తగలదు కాబట్టి దీనికి జీసస్ క్రైస్ట్ బల్లి అని పేరు వచ్చింది. ఇది సాధారణంగా వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి నీటిని రన్‌వేగా వాడుకుంటుంది.

నీటిపై ఎలా నడవగలుగుతోంది?

ఈ బల్లికి నీటిపై నడిచే శక్తి రావడానికి దాని శరీర నిర్మాణం, వేగమే ప్రధాన కారణం. బాసిలిస్క్ బల్లి పాదాలకు వెడల్పుగా ఉండే కాలి వేళ్లు ఉంటాయి. ఇవి నీటిపై అడుగు వేసినప్పుడు గాలి పాకెట్‌లను సృష్టిస్తాయి.
అది తన పాదాలతో నీటిని బలంగా వెనక్కి నెడుతుంది. దీనివల్ల నీటిలో గాలి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు పగిలిపోయేలోపే తన పాదాన్ని బయటకు తీసి మరో అడుగు ముందుకు వేస్తుంది. ఈ బల్లి నీటిపై సెకనుకు దాదాపు 1.5 మీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఈ వేగం వల్ల గురుత్వాకర్షణ శక్తి దానిని కిందకు లాగలేకపోతుంది. పరిగెత్తే సమయంలో తన తోకను అటు ఇటు ఊపుతూ పడవకు చుక్కానిలా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది.

మనిషికి ఇది సాధ్యమేనా?

ఒక మనిషి ఈ బల్లిలాగా నీటిపై మునిగిపోకుండా నడవాలంటే.. గంటకు కనీసం 108 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా మనుషులు పరిగెత్తే వేగం కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. అందుకే ఇది మనిషికి అసాధ్యం.. కానీ బాసిలిస్క్ బల్లికి వెన్నతో పెట్టిన విద్య..

Follow Us