అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్.. రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు

మలేషియాకు చెందిన అరిసాన్ ఇస్మాయిల్ AI.com డొమైన్‌ను క్రిప్టో.కామ్ CEOకి రూ.634 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ ఏప్రిల్ 2021లో జరిగినప్పటికీ, సూపర్ బౌల్ LX సందర్భంగా మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్మాయిల్ డొమైన్‌ను రూ.300లకు కొనుగోలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్.. రూ. 300కి కొన్నాడు.. ఏకంగా రూ. 634 కోట్లకు అమ్మాడు
Ai. Com

Updated on: Feb 14, 2026 | 9:28 PM

మలేషియాకు చెందిన వ్యాపారవేత్త అరిసాన్ ఇస్మాయిల్ AI.com డొమైన్‌ను విక్రయించి ఏకంగా రూ.634 కోట్లు(70 మిలియన్ డాలర్లు) సంపాదించారు. ఈ డొమైన్‌ను క్రిప్టో.కామ్ సీఈఓ కొనుగోలు చేశారు. ఈ డీల్ ఏప్రిల్ 2021లోనే జరిగిందని, అయితే అమెరికన్ ఫుట్‌బాల్ గేమ్ సూపర్ బౌల్ LX సందర్భంగా దీనిని రీలాంచ్ చేయడంతో తాజాగా ఈ ఒప్పందం వెలుగులోకి వచ్చిందని తెలిసింది. అప్పటి నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అరిసాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్‌ను ఎలా కొనుగోలు చేశారనే విషయంలో మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇస్మాయిల్ 1993లో పదేళ్ల వయసులో ఉన్నప్పుడు కేవలం రూ.300 పెట్టుబడితో ఈ డొమైన్‌ను కొనుగోలు చేసినట్టు ఒకరు చెబుతుంటే.. 2021లో డొమైన్ బ్రోకరేజ్ సైట్ saw.com నుంచి ఇస్మాయిల్ ఈ డొమైన్‌ను కొన్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఈ సందర్భంలో అతను ఎంత మొత్తం చెల్లించాడనే దానిపై మాత్రం స్పష్టత లేదు. AI.comకు అంతకుముందు యజమాని ఫ్యూచర్ మీడియా ఆర్కిటెక్ట్స్ అని, ఇది డొమైన్ నేమ్స్ హోల్డింగ్ కంపెనీ అని సమాచారం.

గతంలో కూడా పలు డొమైన్ నేమ్స్ భారీ ధరలు పలికిన సందర్భాలున్నాయి. అత్యంత విలువైన డొమైన్ నేమ్‌లలో ఒకటిగా cars.comకు పేరుంది. తొలుత ఇది క్లాసిఫైడ్ వెంచర్స్ చేతిలో ఉండగా, 2016లో కార్ డీలర్ రివ్యూ వెబ్‌సైట్ డీలర్ రేటర్ దీనిని 872 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది డొమైన్ చరిత్రలో ఒక రికార్డు. ఆ తర్వాత business.com 345 మిలియన్ డాలర్ల విలువతో మరో ప్రముఖ డొమైన్‌గా నిలిచింది. business.com 2007లో 2 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అయితే, ఆ సమయంలో దాని స్టాక్స్ 345 మిలియన్ డాలర్లు పలకడంతో ఇది అత్యంత విలువైన డొమైన్‌లలో ఒకటిగా గుర్తించారు. ఈ వెబ్‌సైట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలనే దానిపై విలువైన చిట్కాలను అందిస్తుంది. మూడోది lasvegas.com, ఇది పర్యాటక రంగంలో లొకేషన్ ఆధారిత డొమైన్‌లు ఎంత కీలకమో వెల్లడిస్తుంది. దీనిని లాస్ వెగాస్ కన్వెన్షన్ అండ్ విజిటర్స్ అథారిటీ 90 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, కార్ ఇన్సూరెన్స్ పరిశ్రమలలో కీలకమైన carinsurance.com 49.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. సరసమైన ధరలలో ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి చిట్కాలు అందించే insurance.com 35.6 మిలియన్ డాలర్లకు విక్రయించారు.