
అడవిలో అత్యంత పెద్దదైన ఏనుగును చూడగానే అందరి దృష్టి దాని ముఖానికి ఇరువైపులా ఉండే పొడవైన, తెల్లని పళ్లపైనే పడుతుంది. అందుకే ఏనుగుకు రెండే పళ్లు ఉంటాయని చాలామంది నమ్ముతారు. కానీ అది కేవలం పైపైన కనిపించే నిజం మాత్రమే. గజరాజు నోటి లోపల ఒక అద్భుతమైన దంత వ్యవస్థ దాగి ఉంది. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన మనిషికి 32 దంతాలు ఉంటాయి. కానీ, ఏనుగుకు మొత్తం 26 దంతాలు ఉంటాయి. వీటి విభజన ప్రకృతి సిద్ధంగా చాలా వింతగా ఉంటుంది. బాహ్య దంతాలు 2 ఉంటాయి. ఇవి నిజానికి ఏనుగు పైదవడలోని ముందరి పళ్లు. నోటి లోపల ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడే దంతాలు 24 ఉంటాయి.
ఏనుగు బయటకు కనిపించే ఆ రెండు కోరలు కేవలం అందం కోసం కాదు. ఇవి ఏనుగు జీవితంలో మల్టీ-పర్పస్ టూల్స్‌లా పనిచేస్తాయి. శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి వీటిని ఆయుధాలుగా వాడతాయి. చెట్ల బెరడును ఒలవడానికి, నేల లోపల ఉన్న వేర్లను తవ్వడానికి, భారీ వృక్షాలను పక్కకు నెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏనుగు కొమ్ములు మనుషుల గోళ్లలాగే నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఇవి ఏడాదికి సగటున 7 అంగుళాల వరకు పెరుగుతాయి.
ఏనుగుకు నోటి లోపల నాలుగు వైపులా దంతాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనుషుల్లాగా ఏనుగుకు నోటిలో ఒకే సమయంలో 24 దంతాలు ఉండవు. ఒకే సమయంలో ఏనుగు నోటిలో కేవలం 4 దంతాలు మాత్రమే పని చేస్తాయి. ఈ ఒక్కో పన్ను సుమారు ఒక ఇటుక సైజులో ఉండి, దాదాపు 2 నుండి 5 కిలోల బరువు ఉంటుంది. ఇవి చాలా గట్టిగా ఉండి ఎంతటి కఠినమైన ఆహారాన్నైనా పిండి చేయగలవు.
మనుషులకు పాలపళ్లు ఊడిపోయాక ఒక్కసారే శాశ్వత దంతాలు వస్తాయి. కానీ ఏనుగులకు వాటి 70 ఏళ్ల జీవితకాలంలో దంతాలు 6 సార్లు మారుతాయి. ముందున్న పన్ను ఆహారం నమిలి నమిలి అరిగిపోయినప్పుడు, అది ముక్కలై రాలిపోతుంది. అప్పుడు వెనుక నుంచి కొత్త పన్ను నెమ్మదిగా ముందుకు జరుగుతుంది. దీన్ని శాస్త్రీయంగా పాలిఫియోడాంట్ అంటారు. ఆరోసారి వచ్చిన పళ్లు కూడా అరిగిపోతే, ఏనుగు ఆహారాన్ని నమలలేక బలహీనపడిపోతుంది. అందుకే ముసలి ఏనుగులు ఎక్కువగా మెత్తటి గడ్డి దొరికే బురద ప్రాంతాల్లో ఉండటానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఆరో పన్ను కూడా పూర్తిగా అరిగిపోతే ఏనుగు ఆకలితో మరణించే అవకాశం ఉంది.
ఏనుగు పళ్లలో ఉండే ఐవరీ అత్యంత ఖరీదైనది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఉన్న డిమాండ్ కారణంగా ఏనుగులను వేటాడటం పెద్ద సమస్యగా మారింది. ఇది ఏనుగుల మనుగడకే ముప్పుగా పరిణమించింది. ఏనుగు దంతాలు కేవలం ఆహారం తీసుకోవడానికి మాత్రమే కాదు దాని అస్తిత్వానికి ప్రతీక.