
హైవేలపై టోల్ చెల్లింపులను వేగంగా, సులభంగా పూర్తి చేసేందుకు FASTag కీలకంగా మారింది. వాహనం విండ్‌షీల్డ్‌పై ఉన్న చిన్న FASTag స్టిక్కర్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులు ఆటోమేటిక్‌గా పూర్తవుతున్నాయి. అయితే ఇప్పటివరకు FASTag జారీ చేసే బ్యాంకును మార్చుకోవాలంటే పాత ట్యాగ్‌ను మూసివేసి, కొత్త బ్యాంకు నుంచి మరో FASTag తీసుకోవాల్సి వచ్చేది. దీంతో స్టిక్కర్ మార్చడం, కొత్త ట్యాగ్ కోసం ప్రక్రియ పూర్తి చేయడం వాహనదారులకు ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘OneTag’ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో..
OneTagను సులభంగా అర్థం చేసుకోవాలంటే మొబైల్ నంబర్ పోర్టబిలిటీతో పోల్చుకోవచ్చు. మొబైల్ నంబర్‌ను మార్చకుండా ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారినట్లే.. OneTag ద్వారా FASTag స్టిక్కర్, ట్యాగ్ ఐడీ, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను అలాగే ఉంచుకుని జారీ చేసే బ్యాంకును మార్చుకోవచ్చు.
స్టిక్కర్ మార్చాల్సిన అవసరం లేదు!
OneTagలో ప్రధాన ప్రయోజనం ఇదే. బ్యాంక్ మారినప్పుడు వాహనం విండ్‌షీల్డ్‌పై ఉన్న FASTagను తొలగించాల్సిన అవసరం ఉండదు. కొత్త FASTagను తీసుకుని మరో స్టిక్కర్ అతికించాల్సిన అవసరం కూడా ఉండదు. ట్యాగ్ ఐడీ, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ కొనసాగుతాయి.
బ్యాంక్ మార్చడం ఎలా?
వినియోగదారులు NHAIకి చెందిన రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా OneTag సేవను పొందే అవకాశం ఉంది. పోర్టబిలిటీ ప్రక్రియ పూర్తైన తర్వాత FASTagకు సంబంధించిన బ్యాకెండ్ రికార్డులు కొత్త జారీ చేసే బ్యాంకుకు అనుసంధానమవుతాయి. అనంతరం FASTagకు సంబంధించిన సేవలను కొత్త బ్యాంకు నిర్వహిస్తుంది.
టోల్ చెల్లింపుల్లో మార్పు ఉంటుందా?
బ్యాంక్ మారినప్పటికీ టోల్ చెల్లింపుల విధానంలో పెద్దగా మార్పు ఉండదు. FASTag ద్వారా టోల్ చెల్లింపులు NETC వ్యవస్థలోనే కొనసాగుతాయి. అంటే వాహనదారులు టోల్ ప్లాజా వద్ద సాధారణంగానే FASTagను ఉపయోగించవచ్చు.
పాత FASTagలోని బ్యాలెన్స్ సంగతేంటి?
ఇక్కడ వాహనదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఉంది. బ్యాంక్ మార్చినంత మాత్రాన పాత FASTag ఖాతాలో ఉన్న నగదు బ్యాలెన్స్ కొత్త బ్యాంకుకు ఆటోమేటిక్‌గా బదిలీ కాదు. పాత బ్యాంకులోని బ్యాలెన్స్, రీఫండ్‌లు, పెండింగ్ లావాదేవీలను ప్రస్తుత జారీ చేసే బ్యాంకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల OneTag ద్వారా బ్యాంక్ మార్చుకునే ముందు పాత FASTag ఖాతాలోని బ్యాలెన్స్, పెండింగ్ టోల్ లావాదేవీలు, రీఫండ్‌లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
వాహనదారులకు ఎందుకు ఉపయోగకరం?
ప్రస్తుతం FASTag సేవలపై అసంతృప్తిగా ఉన్నవారు, మరో బ్యాంకు అందించే మెరుగైన సేవలను ఉపయోగించాలనుకునేవారు OneTag ద్వారా సులభంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా FASTag స్టిక్కర్‌ను తొలగించడం, కొత్త ట్యాగ్ తీసుకోవడం వంటి అదనపు ప్రక్రియ తగ్గుతుంది.
మొత్తంగా చూస్తే.. వాహనం మారదు, FASTag స్టిక్కర్ మారదు, ట్యాగ్ ఐడీ మారదు.. కానీ FASTagను నిర్వహించే బ్యాంకును మార్చుకునే వెసులుబాటు OneTag ద్వారా లభించనుంది. FASTag వినియోగదారులకు ఇది మరింత సౌకర్యవంతమైన, పోర్టబుల్ టోల్ చెల్లింపు వ్యవస్థగా మారే అవకాశం ఉంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..