జోరందుకున్న వానాకాలం వ్యవసాయ పనులు.. అద్దెకు అరక కాడెడ్లు..!

| Edited By: Balaraju Goud

Jun 26, 2024 | 1:36 PM

పంటల సాగులో యాంత్రీకరణ పెరిగినా, కొన్ని చోట్ల సాంప్రదాయ పద్ధతుల్లో విత్తనాలను నాగలి, గుంటుకతోనే విత్తుతున్నారు. దీంతో పశు పోషణ తగ్గిపోయి అరక కాడెడ్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అరక ఎడ్లను అద్దెకు ఇస్తున్నారు.

జోరందుకున్న వానాకాలం వ్యవసాయ పనులు.. అద్దెకు అరక కాడెడ్లు..!
Farmer
Follow us on

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. దీంతో రైతులు భూమిని చదును చేసి ఇప్పటికే విత్తనాలు వేయగా, మరికొందరు దుక్కులు దున్నుతూ విత్తడం కోసం సిద్ధం చేసుకునే పనుల్లో మునిగిపోయారు. పంటల సాగులో యాంత్రీకరణ పెరిగినా, కొన్ని చోట్ల సాంప్రదాయ పద్ధతుల్లో విత్తనాలను నాగలి, గుంటుకతోనే విత్తుతున్నారు. దీంతో పశు పోషణ తగ్గిపోయి అరక కాడెడ్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అరక ఎడ్లను అద్దెకు ఇస్తున్నారు.

అద్దెకు కాడెడ్లు…

ప్రస్తుతం మార్కెట్‌లో ఏ వస్తువైనా రెడీమేడ్‌గా లభిస్తోంది. వ్యవసాయంలో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు యంత్రాలు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పుడు అరకకు కోడెలు కూడా అద్దెకు లభిస్తున్నాయి. ఆధునిక యంత్రాల రాకతో గ్రామాల్లో పశుపోషణ తగ్గిపోయింది. గ్రామాల్లో ఎద్దుల పోషణకు అయ్యే ఖర్చు, ప్రత్యేకంగా ఓ మనిషిని కేటాయించే పరిస్థితి లేక చాలా మంది రైతులు కాడెడ్లను సాకడం మానేశారు. ప్రస్తుతం పెద్ద రైతుల వద్ద మాత్రమే ఎద్దులు కనిపిస్తున్నాయి.

అయితే కొంత కాలంగా దుక్కులు దున్నడం, వ్యవసాయ భూములు చదును చేయడం మొదలైన పనులు అన్నీ ట్రాక్టర్ల సహాయంతో చేస్తూ ముందుకు సాగుతున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లాలో చాలా వరకు రైతులు ప్రధానంగా పత్తిని పండిస్తారు. ఈ విత్తనాలను విత్తడం, వరుసలు వేయడం, పంటలో కలుపు తీయడానికి గుంటుక కొడుతుంటారు. వీటి కోసం అరక ఎద్దుల అవసరం తప్పని సరిగా మారింది. గ్రామాల్లో ప్రస్తుతం వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఉంటే పదుల సంఖ్యలో మాత్రమే కాడెడ్లు ఉన్నాయి. ఎద్దుల పోషణ భారంగా మారింది. దీంతో చాలా మంది కిరాయికి ఎద్దుల అరకను తీసుకోని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. దీంతో అరకకు కాడెడ్లకు డిమాండ్ పెరిగింది. కొందరు ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి, వచ్చిన డబ్బుల ద్వారా వాటిపోషణ ఖర్చులను వెల్లదీసుకుంటున్నారు.

అరక కాడెడ్ల అద్దెతో జీవనోపాధి…

గ్రామాల్లో కొందరు రైతులు రెండు మూడు జతల ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. మరి కొందరు తమకున్న కొద్దిపాటి వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారు. మిగతా రోజుల్లో చిన్న సన్నకారు రైతులకు కిరాయికి ఇస్తూ వాటి పోషణ ఖర్చులు వెల్లదీస్తున్నారు. తనకున్న మూడు ఎకరాల్లో పత్తిని సాగు చేసి, గ్రామంలో అరక సామగ్రితో పాటు ఎడ్లు, మనిషి కిరాయికి వెళ్తే రోజుకు సుమారు రూ.2 వేల వరకు కిరాయి లభిస్తుందని సాయిలు అనే రైతు చెబుతున్నారు. మనిషి లేకుండా అయితే రూ.1500 వరకు అద్దె చెల్లిస్తున్నారని తెలిపారు.

ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వానాకాలం పత్తి, కంది, యాసంగిలో జొన్న పంటలను పండిస్తున్న రైతులు.. అద్దె కాడెడ్లు, అరక సామగ్రి, కూలీలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఖర్చులు కూడా కలిసి వస్తున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు. అటు అద్దెకు ఇచ్చే రైతులకు ఆదాయంతో పాటు పోషణ ఖర్చులు మిగులుతున్నాయంటున్నారు.

మరిన్ని హ్యమున్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..