ఆగండి ఆగండి.. కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే కళ్లకు అద్దుకుంటారు..

కొబ్బరి పెంకుల్లో ఇన్ని పోషకాలు ఉంటాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం. సాధారణంగా పారేసే కొబ్బరి పెంకులు మొక్కల పెంపకంలో ఎంతో విలువైనవి. వీటిని తక్కువ ఖర్చుతో ఇంటి పెరటి తోటలకు ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పెంకుల్లో మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పెంకులను నీటిలో నానబెట్టి తయారు చేసిన ద్రవం, పెంకులను మల్చింగ్‌గా ఉపయోగించడం ద్వారా పూత, కాత పెరిగి, కలుపు నివారించబడుతుంది. తక్కువ ఖర్చుతోనే సమర్థవంతమైన సేంద్రియ పద్ధతి ఇది. ఇది మీ గార్డెన్‌కు అమృతంలా పనిచేస్తుంది. పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

ఆగండి ఆగండి.. కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే కళ్లకు అద్దుకుంటారు..
Coconut Shells For Gardening

Updated on: Mar 13, 2026 | 5:22 PM

కొబ్బరి పెంకుల్లో పోషకాలు ఉంటాయా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే.. మనం సాధారణంగా చెత్తగా భావించి పారేసే కొబ్బరి పెంకులు మొక్కల పెంపకంలో ఎంతో విలువైనవి అని తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వనరులతోనే మొక్కలను పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ కొబ్బరి పెంకులను వివిధ రకాలుగా ఉపయోగించుకునే పద్ధతులను తెలుసుకుందాం. ఇవి మొక్కల ఆరోగ్యానికి, దిగుబడికి గణనీయంగా తోడ్పడతాయి.

1. శక్తివంతమైన ద్రవ ఎరువుగా కొబ్బరి పెంకుల రసం:

కొబ్బరి పెంకులను ఐదు రోజుల పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఒక పోషకభరితమైన ద్రవ ఎరువు తయారవుతుంది. ఈ ద్రావణం లేత గోధుమ రంగులోకి మారుతుంది. దీనిని నేరుగా కాకుండా, ఒక మగ్గు పెంకుల రసానికి ఐదు మగ్గుల సాధారణ నీటిని కలిపి పలుచగా చేసి మొక్కలకు పోయాలి. ఈ ద్రవ ఎరువులో పొటాషియం, బోరాన్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ముఖ్యంగా పూత, కాత దశలో ఉన్న మొక్కలకు అత్యంత ప్రయోజనకరమైనవి. పొటాషియం పూత రాలకుండా చేసి, కాతను పెంచుతుంది. బోరాన్ కాయలు వంకరటింకరగా రాకుండా, వాటి ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొండమామిడి, నేరేడు, జంబో నేరేడు, తెల్లనేరేడు వంటి మొక్కలకు ఇది పూత రాలకుండా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. పాటింగ్ సాయిల్‌లో నీటిని నిలుపుకునే స్పాంజ్‌గా:

కొబ్బరి పెంకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి, పాటింగ్ సాయిల్‌లో కలుపుకోవడం మరొక ప్రయోజనకరమైన పద్ధతి. ఈ పెంకు ముక్కలు మట్టిలో ఒక సహజమైన స్పాంజ్‌లాగా పనిచేస్తాయి. ఇవి నీటిని పట్టి ఉంచుకోవడం వల్ల మట్టి ఎక్కువ కాలం తేమగా ఉంటుంది. తద్వారా మొక్కలకు నీటి లభ్యత మెరుగుపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఈ పెంకులు నెమ్మదిగా మట్టిలో డీకంపోజ్ అయి, సేంద్రీయ పదార్థాన్ని అందించి, నేల సారాన్ని పెంచుతాయి.

3. మల్చింగ్‌గా, కలుపు నివారణిగా:

ద్రవ ఎరువు తీసిన తర్వాత మిగిలిన కొబ్బరి పెంకులను పారేయాల్సిన అవసరం లేదు. వీటిని మల్చింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఎండాకాలంలో కుండీలలోని మట్టి లేదా నేల వేగంగా ఎండిపోతుంది. అప్పుడు ఈ పెంకులను మొక్కల మొదళ్ల చుట్టూ లేదా కుండీలోని మట్టిపైన పరచడం వల్ల తేమ ఆవిరైపోకుండా ఉంటుంది. ఇది మట్టిని చల్లగా ఉంచి, మొక్కల వేళ్లను రక్షిస్తుంది. మల్చింగ్ వల్ల కేవలం నీటి సంరక్షణ మాత్రమే కాకుండా, కలుపు మొక్కలు పెరగకుండా కూడా నివారించబడతాయి. ఒకేసారి రెండు ప్రయోజనాలను పొందేందుకు ఇది సులభమైన, సమర్థవంతమైన మార్గం.

ఈ విధంగా కొబ్బరి పెంకులను వ్యర్థంగా పారేయకుండా, తోటపనిలో ఉపయోగించుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో పర్యావరణ హితమైన పద్ధతిలో మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది గార్డెనింగ్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us