
హోటల్ అంటే 100 లేదా 200 మరి పెద్దదైతే 1000 వరకు గదులు ఉంటాయి. కానీ ఈ హోటల్‌లో ఎన్ని గదులు ఉన్నాయో తెలిస్తే పక్కా మీరు అవాక్కవుతారు. మీరు ఎప్పుడూ 5-స్టార్, 7-స్టార్ హోటల్స్ గురించే వింటాం. కానీ సైజులో ప్రపంచ రికార్డ్ కొట్టిన ఒక హోటల్ ఉంది. ఇది అమెరికాలోనో, యూరప్‌లోనో కాదు.. మనకు దగ్గరలోనే ఉన్న మలేషియాలో ఉంది. అదే ఫస్ట్ వరల్డ్ హోటల్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరున్న ఈ హోటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మలేషియాలోని పహాంగ్ రాష్ట్రంలో ఉన్న జెంటింగ్ హైలాండ్స్‌లో ఈ అతిపెద్ద హోటల్ ఉంది. దీని పేరు ఫస్ట్ వరల్డ్ హోటల్. ఈ హోటల్‌లో ఏకంగా 7,351 గదులు ఉన్నాయి. ఈ రికార్డు కారణంగానే ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ హోటల్ కింద ఫస్ట్ వరల్డ్ ప్లాజా అనే భారీ షాపింగ్, వినోద సముదాయం ఉంది. దీని విస్తీర్ణం 46,000 చదరపు మీటర్లు
ఫస్ట్ వరల్డ్ హోటల్‌కు ప్రధానంగా టవర్ 1 – టవర్ 2 అనే రెండు టవర్లు ఉన్నాయి. ప్రతి టవర్‌లో 36 అంతస్తులు ఉంటాయి. ఒక టవర్ సుమారు 154.6 మీటర్లు ఎత్తు ఉంటుంది. 2015లో అదనంగా టవర్ 2A ను జోడించడంతో వరల్డ్ లోనే ఎక్కువ రూమ్స్ ఉన్న హోటల్‌గా మారింది. ఈ హోటల్‌లో ఆరు రకాల గదులు ఉన్నాయి. ఇవి వివిధ రకాల ఛార్జీలతో, అవసరమైన అన్ని సౌకర్యాలతో అతిథులకు సౌకర్యాన్ని అందిస్తాయి.
ఫస్ట్ వరల్డ్ హోటల్ కేవలం గదులకే కాదు.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ఫేమస్. హోటల్ లాబీ పైన ఉన్న ఫస్ట్ వరల్డ్ ప్లాజాలో రిటైల్ దుకాణాలు, షాపులు, రకరకాల ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఇక్కడ స్కైట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్, స్నో వరల్డ్, జెంటింగ్ బౌల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ హోటల్ నుండి ఆధునిక షాపింగ్ మాల్ అయిన స్కైఅవెన్యూ మాల్‌కు సులభంగా చేరుకోవచ్చు.
ఫస్ట్ వరల్డ్ హోటల్‌ను జెంటింగ్ మలేషియా బెర్హాద్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇది జెంటింగ్ గ్రూప్ అనుబంధ సంస్థ. దీని యజమాని జెంటింగ్ గ్రూప్ వ్యవస్థాపకుడు లిమ్ గో టోంగ్ కుమారుడు లిమ్ కోక్ థాయ్.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..