
పాములు పగబడతాయనేది తరచూ వినిపించే ఒక బలమైన నమ్మకం. ఈ అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి. ఒక వ్యక్తిని పదే పదే అదే పాము కాటు వేసిందని లేదా తమకు హాని చేసిన వారిపై పాములు ప్రతీకారం తీర్చుకుంటాయని కథలు సమాజంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, శాస్త్రీయంగా ఈ వాదనల్లో ఎలాంటి నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం.. పాములకు జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉంటుందట. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేసేంత సామర్థ్యం వాటికి ఉండదట. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసనను గుర్తుంచుకుంటాయే తప్ప, దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకోలేవట. నిజానికి, చాలా వరకు పాములు పుట్ట నుంచి బయటకు వచ్చిన తర్వాత, తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందో కూడా మర్చిపోతాయని జంతు వైద్యులు చెబుతున్నారు.
ఒకే వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటు వేయడం కేవలం యాదృచ్ఛికం మాత్రమే కావచ్చని నిపుణులు చెబుతున్నారు. పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవని.. మనం వాటికి దూరంగా వెళ్ళిపోతే, అవి కూడా వాటి దారిలో అవి వెళ్ళిపోతాయని చెబుతున్నారు. కానీ వాటికి ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగితే, అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొడతాయి లేదా కాటు వేస్తాయని చెబుతున్నారు. అంతేతప్ప, పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం ఒక మూఢనమ్మకం అని శాస్త్రవేత్తలు అంటున్నారు
సంస్కృతి, వైద్య రంగంలో పాము విషం ప్రాధాన్యత
ప్రపంచంలోని కొన్ని దేశాల సంస్కృతిలో పాములు భాగమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పాముల్ని ఆహారంగా తింటారు. వాటి రక్తాన్ని లిక్కర్‌లో కలుపుకుని తాగుతారు. చైనా వంటి ఆసియా దేశాల్లో స్నేక్ వైన్ కూడా తయారు చేస్తారట. మరోవైపు వైద్య రంగంలో పాము విషం అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది. పాము కాటుకు ఇచ్చే యాంటీ వెనమ్‌ను కూడా పాము విషం నుంచే తయారు చేస్తారట. అంతేకాకుండా మానవుల ఆరోగ్య సమస్యల నివారణకు అవసరమైన ఔషధాల తయారీలో కూడా పాము విషాన్ని ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.