కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

కాకులు కేవలం కా కా అని అరుస్తూ.. చెత్త తినే పక్షులు మాత్రమే అనుకుంటే పొరపాటే.. శాస్త్రవేత్తలు వీటిని పక్షి ప్రపంచంలోని ఐన్‌స్టీన్లుగా అభివర్ణిస్తున్నారు. మనుషుల లాగే ఆలోచిస్తూ, సమస్యలను పరిష్కరించే ఈ పక్షుల అద్భుత మేధస్సు వెనుక ఉన్న రహస్యాలేమిటో తెలుసుకుందాం.

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
Are Crows The Einsteins Of The Bird World

Updated on: Feb 28, 2026 | 9:52 PM

మన ఇంటి చుట్టూ అరుస్తూ తిరిగే కాకులను మనం సాధారణ పక్షులుగా చూస్తాం. వాటి నలుపు రంగు, బొంగురు గొంతు మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రవేత్తలకు కాకులు కేవలం పక్షులు మాత్రమే కాదు.. అవి పక్షి ప్రపంచంలోని ఐన్‌స్టీన్లు. మనుషులకే పరిమితం అనుకున్న అత్యున్నత మేధస్సు ఈ కాకులకు ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా న్యూ కాలెడోనియన్ జాతి కాకులు మనుషుల్లాగే ఆలోచిస్తూ, సమస్యలను పరిష్కరిస్తున్నాయి.

సమస్యకు తగ్గ పరిష్కారం.. కొలత జ్ఞానం

కాకులు చాలా తెలివైనవి, అవి ఎదుర్కొనే కష్టాన్ని బట్టి ఉపకరణాలను ఎంచుకుంటాయి. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రయోగంలో.. ఒక లోతైన రంధ్రంలో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి, కాకులు వెంటనే సరైన పొడవు ఉన్న కర్రను ఎంచుకున్నాయి. దీనిని బట్టి వాటికి అద్భుతమైన కొలత జ్ఞానం ఉందని అర్థమవుతోంది.

మెటా-టూల్స్ నైపుణ్యం

కాకుల తెలివితేటలు అక్కడితో ఆగవు. ఇవి మెటా టూల్స్ ఉపయోగించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటాయి. అంటే ఒక చిన్న కర్రను ఉపయోగించి పెద్ద కర్రను తీసుకుని ఆ పెద్ద కర్రతో తమ ఆహారాన్ని సాధిస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచించి, ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ లక్షణం చింపాంజీలలో మాత్రమే ఉంటుందని అనుకునేవారు కానీ కాకులు ఇది తప్పు అని నిరూపించాయి.

మానవుల మాదిరిగానే మెదడు పనితీరు

ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. సాధనాలను ఉపయోగించడంలో కాకులు ప్రాక్టీస్‌తో నైపుణ్యాన్ని పెంచుకుంటాయి. శాస్త్రవేత్తలు కాకుల మెదడులను పరిశీలించినప్పుడు మానవ మెదడు మాదిరిగానే కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు మెదడు కణాలు అనుగుణంగా మారతాయని కనుగొన్నారు.

భవిష్యత్తు ప్రణాళిక

కాకులకు ఏది అత్యంత విలువైనదో తెలుసు. సాధారణ కర్రల కంటే హుక్ లాంటి కర్రలను ఇవి ఇష్టపడతాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. తదుపరి అవసరం కోసం ఉపకరణాలను ముందుగానే ఎంచుకునే సామర్థ్యం వీటికి ఉంది. మనం సాధారణ పక్షులుగా విస్మరించే ఈ జీవులు, సైన్స్ దృష్టిలో అత్యంత తెలివైన జంతువులు. కాకుల ఈ నైపుణ్యాలు మేధస్సు అంటే ఏమిటో మన పాత నిర్వచనాన్ని మార్చేశాయి.

Follow Us