Flood Behind Story: భార్యను ఇంటికి రాకుండా ఆపాలనుకున్నాడు.. చివరికి 3 దశాబ్దాలుగా జైలు శిక్ష..!

అర్థాంగి కళ్లుగప్పి తప్పులు చేసే మగమహారాజులు లోకంలో కోకొల్లలు. భార్యకు తెలీకుండా మందు పార్టీలు చేసుకోవడం వంటివి ఘనకార్యాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. పార్టీ జరుగుతుండగా భార్య వస్తుందని తెలిస్తే ఎవరైనా సరే పార్టీని ఆపేసి, అన్ని సర్దేసుకుంటారు. కొందరు భార్యను ఇంటికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఓ ప్రయత్నమే 23 ఏళ్ల ఆ వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టింది.

Flood Behind Story: భార్యను ఇంటికి రాకుండా ఆపాలనుకున్నాడు.. చివరికి 3 దశాబ్దాలుగా జైలు శిక్ష..!
Mississippi Great Flood Of 1993
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 21, 2024 | 1:47 PM

అర్థాంగి కళ్లుగప్పి తప్పులు చేసే మగమహారాజులు లోకంలో కోకొల్లలు. భార్యకు తెలీకుండా మందు పార్టీలు చేసుకోవడం వంటివి ఘనకార్యాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. పార్టీ జరుగుతుండగా భార్య వస్తుందని తెలిస్తే ఎవరైనా సరే పార్టీని ఆపేసి, అన్ని సర్దేసుకుంటారు. కొందరు భార్యను ఇంటికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఓ ప్రయత్నమే 23 ఏళ్ల ఆ వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టింది. ముప్పై ఏళ్లుగా కారాగారవాసానికి పరిమితం చేసింది. ఇంతకీ ఆ ప్రబుద్ధుడు చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతారు.

పార్టీని మధ్యలో ఆపేయడం ఇష్టం లేక.. భార్యను ఇంటికి రాకుండా అడ్డుకోవడం కోసం ఏకంగా ఓ భారీ వరదకు కారణమయ్యాడు జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి. అమెరికాలో మిస్సిసిప్పి నది ఒడ్డున ఉన్న క్విన్సీ పట్టణంలో 1993లో ఈ ఘటన చోటుచేసుకుంది. వరదకు కారణమైన జేమ్స్ స్కాట్‌ జైలు పాలయ్యాడు.

ఇంతకీ ఎవరీ జేమ్స్ స్కాట్?

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న క్విన్సీ పట్టణానికి చెందిన జేమ్స్ రాబర్ట్ స్కాట్.. స్థానికంగా బ్యాడ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలో బుద్ధిగా స్కూలుకు వెళ్లే పిల్లాడిగా వ్యవహరించిన స్కాట్, వయస్సు పెరిగే కొద్దీ సమస్యలను కొని తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇరవై ఏళ్ల ప్రాయానికి వచ్చేసరికి వివిధ రకాల నేరారోపణలపై జైలు శిక్ష కూడా అనుభవించాడు. స్కాట్ ఎక్కువగా చేసే నేరం దోపిడీ. నగరంలోని చారిత్రక కట్టడంగా పేరుగాంచిన వెబ్‌స్టర్ ఎలిమెంటరీ స్కూల్‌తో పాటు ఆ పక్కనే ఉన్న చెత్తకుప్పను తగులబెట్టిన అభియోగాలు స్కాట్‍‌పై ఉన్నాయి.

జైలు నుంచి వచ్చిన తర్వాత సూజీని పెళ్లి చేసుకున్నాడు. బర్గర్ కింగ్ ఫుడ్ కోర్టులో పనిచేస్తూ కుటుంబ జీవితం గడపసాగాడు. పెళ్లయ్యాక బుద్ధి మారిందని అనుకుంటే పొరపాటే. ఆ తర్వాత కూడా అనేక చిన్న చిన్న నేరాల్లో పాల్గొనడంతో పాటు తరచుగా మద్యం సేవించడం, మిత్రులతో కలిసి పార్టీలు చేసుకోవడం అతనికి నిత్యకృత్యంగా మారింది. ఏ స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకున్నాడో.. ఆ స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలమే స్కాట్‌ను కటకటాలపాలు చేసింది.

ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

1993 జులై నెలలో అమెరికా చాలా రోజుల పాటు భారీ వర్షాలను ఎదుర్కొంది. ఫలితంగా నదులు ఉప్పొంగి ప్రవహించసాగాయి. చాలా రాష్ట్రాలు వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలో మిస్సిసిప్పి నది ఒడ్డున ఉన్న క్విన్సీ పట్టణం కూడా వరద అంచున ఉంది. నది నీరు పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్ట ఆ వరదను అడ్డుకునే పరిస్థితి కనిపించలేదు. ఏ క్షణమైనా వరద ఉధృతి మరింత పెరిగి నీరు పట్టణంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని అధికారులు గ్రహించారు. వెంటనే స్థానికులతో కలిసి సంచుల్లో ఇసుకను నింపి కరకట్ట ఎత్తును మరింత పెంచే ప్రయత్నం చేశారు. స్థానికులు వాలంటీర్లుగా మారి ఇసుక బస్తాలను వరుసగా పేర్చుకుంటూ పోయారు. రాత్రికి నదిలో నీటిమట్టం మరి కాస్త పెరిగినా సరే తట్టుకుంటుంది అన్న నమ్మకం స్థానికుల్లో కలిగింది.

సరిగ్గా 1993, జులై 16 రాత్రి 8.00 గంటల తర్వాత నీరు కరకట్టను దాటి పొలాల్లోకి ప్రవేశించింది. మొత్తం 14 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద నీరు ఓ పెట్రోల్ బంక్‌లోకి ప్రవేశించి పేలుడుకు కారణమైంది. అదృష్టావశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అలాగే వరద నీరు అనేక వంతెనలను ముంచెత్తడమే కాదు, వాటిలో కొన్ని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

అనుమానం ఇలా మొదలైంది

తొలుత అందరూ ఇది ప్రకృతి విపత్తుగానే భావించారు. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినా ఉపయోగం లేకపోయిందని అనుకున్నారు. వరదల సమాచారం తెలుసుకున్న వివిధ వార్తాసంస్థల విలేకరులు అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి జేమ్స్ స్కాట్ అటువైపుగా వెళ్తూ వారికి కనిపించాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని స్కాట్‌తో వారు మాట కలిపి ఇంటర్వ్యూ తీసుకున్నారు. తాను ఉదయం నుంచి బస్తాల్లోకి ఇసుక నింపి, అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో వాలంటీర్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. అందరూ కలిసి నిర్మించిన ఇసుక బస్తాల కరకట్ట ఓ చోట బలహీనంగా ఉందని గుర్తించి, తాను దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశానని.. ఇంటికెళ్లి ఓ పెగ్గు వేసుకొచ్చి చూసేసరికి ఆ బలహీన ప్రాంతం వద్ద కట్ట తెగిపోయిందని వివరించాడు.

ఈ ఇంటర్వ్యూ కథనాలను చూసిన స్థానిక యంత్రాంగానికి అప్పుడే అనుమానం మొదలైంది. స్కాట్ నేరచరిత్ర గురించి పూర్తిగా తెలిసిన వారు ఇదేదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని భావిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. స్కాట్ ఇంటర్వ్యూను పరిశీలిస్తే, అతను చెప్పినట్టు కరకట్టను బలోపేతం చేసిన ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో అతను వేసుకున్న షర్ట్ ఏమాత్రం నలిగిపోకుండా, మరకలు లేకుండా ఉంది. అలాగే వాలంటీర్లు అందరూ లైఫ్ జాకెట్ వేసుకుని ఉండగా.. స్కాట్ ఒంటి మీద అది కనిపించలేదు.

అయితే కేవలం అనుమానంతోనే అరెస్టు చేయలేరు కాబట్టి అతనిపై గతంలో నమోదైన ఇతర అభియోగాలపై అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీస్ కస్టడీలో కూడా రిపోర్టర్లకు చెప్పిన కథనాన్నే మళ్లీ చెప్పుకొచ్చాడు. తాను స్థానికులతో కలిసి సహాయం చేశానని నమ్మించే ప్రయత్నం చేశాడు. స్కాట్ నోటి నుంచి నిజం బయటికి రాకపోవడంతో అతని స్నేహితులను విచారించారు. ఎవరి దగ్గరా ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ స్కాట్ మిత్రుడు జో ఫ్లాక్స్ దగ్గర అసలు విషయం బయటపడింది.

ఫ్లాక్స్‌తో కలిసి ఆ రోజు స్కాట్ పార్టీ చేసుకుంటున్నాడు. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. కానీ నదికి అవతలి ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తున్న స్కాట్ భార్య సుజీ.. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి చేరుకోవాల్సి ఉంది. సుజీ ఇంటికొస్తే ఇంట్లో జరుగుతున్న తతంగం చూసి భర్తపై చిర్రుబుర్రులాడే అవకాశం ఉంది. అందుకే పార్టీని ఎలాగైనా సరే కొనసాగించాలని.. సుజీని నది దాటి ఇంటికి చేరుకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒకే ఒక మార్గం.. ఉదయం నుంచి వాలంటీర్లుగా మారి స్థానికులు నిర్మించిన ఇసుక బస్తాల కరకట్టను ధ్వంసం చేయడమేనని భావించాడు. ఇదే విషయాన్ని మిత్రుడు ఫ్లాక్స్‌కు చెప్పాడు. వరద పోటెత్తి వంతెన మునిగిపోవడంతో సుజీ ఆ రాత్రి ఇంటికి రాలేకపోయింది. స్కాట్ – ఫ్లాక్స్ చేసుకుంటున్న పార్టీ కొనసాగింది.

వాంగ్మూలమే ఏకైక ఆధారంగా…

జేమ్స్ స్కాట్ కేసులో ఫ్లాక్స్ ఇచ్చిన వాంగ్మూలం తప్ప బలమైన ఆధారమేదీ లేదు. మొత్తంగా కేసు విచారణ 1994 నవంబర్‌లో ప్రారంభమైంది. కరకట్టను ధ్వంసం చేయడం గురించి స్కాట్ ఓ ఘనకార్యంగా చెప్పుకోవడం తాము విన్నామంటూ మరికొందరు వ్యక్తులు ముందుకొచ్చి సాక్ష్యమిచ్చారు. డిఫెన్స్ వాదనలు కూడా బలంగానే సాగాయి. నీటిపారుదల విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు సైతం ఆ సమయంలో కరకట్ట విఫలమయ్యేందుకు అవకాశం ఉందని చెప్పారు. క్విన్సీ పట్టణానికి ఎగువన ఉన్న ఇతర ఉప నదులు, వాగులు కూడా విఫలమయ్యాయి. బుల్‌డోజర్లతో కట్టను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు సైతం దాన్ని దెబ్బతీయడానికి దోహదం చేశాయని చెప్పారు. వాదోపవాదాల అనంతరం స్కాట్ ఉద్దేశపూర్వకంగా విపత్తుకు కారణమయ్యాడని జ్యూడిషియల్ భావించింది. పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు గతంలో చేసిన దొంగతనాల కేసుల్లోనూ 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికాలో వేర్వేరు కేసుల్లో శిక్షలను ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేస్తారు. కాబట్టి 30 ఏళ్లుగా అతను ఇంకా కారాగారంలోనే ఉన్నాడు.

అయితే స్కాట్ చిల్లరమల్లర దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడేవాడే తప్ప హింసాత్మక లేదా లైంగిక నేరాలకు పాల్పడ్డ చరిత్ర లేదని.. అలాంటి వ్యక్తికి ఇంత శిక్ష విధించడం తగదని పట్టణంలో కొందరు భావించగా.. స్కాట్ చేసిన నేరాలకు తగ్గ శిక్షే పడిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. స్కాట్ మాత్రం వరద విషయంలో తన తప్పు లేదని, గతంలో చేసిన నేరాలకే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతున్నాడు. శిక్షాకాలం పూర్తిచేసుకుని 2026 జులైలో స్కాట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఊరికి నష్టం.. ఆయనకు మాత్రం ప్రయోజనం

ఫాబియస్ రివర్ డ్రైనేజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్‌గా ఉన్న నార్మన్ హేర్ కేసు విచారణ సమయంలో జేమ్స్ స్కాట్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. స్కాట్ చర్య కారణంగా మునిగిపోయిన పంట భూముల్లో నార్మన్ హేర్ పొలాలు కూడా ఉన్నాయి. హేర్ పంటలకు చేయించుకున్న బీమాలో మానవ ప్రయత్నాలతో జరిగిన విధ్వంసాలకు తప్ప ప్రకృతి విపత్తుల కారణంగా జరిగే నష్టానికి బీమా చెల్లించడం కుదరదు. కానీ జేమ్స్ స్కాట్‌ను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించడం కారణంగా దీన్ని ప్రకృతి విపత్తుగా పరిగణించడం కుదరదని, స్కాట్ చేసిన విధ్వంసంగా తేలింది కాబట్టి నార్మన్ హేర్ బీమా సొమ్ము పొందగలిగారు. ఒకవేళ కరకట్ట సహజసిద్ధంగా ధ్వంసమై పొలాల్లోకి నీరు వచ్చినట్టయితే ఆయనకు బీమా సొమ్ము అందేది కాదు. ఇలా ఓ వ్యక్తి తన భార్యను ఇంటికి రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం చరిత్ర పేజీల్లోకి చేరింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…