Yuga Amol Thackeray BirthDay – Blood donation: చాలామంది తమ పిల్లల పుట్టిన రోజు అంటే.. ఎంతో హడావుడి చేస్తుంటారు. కుటుంబసభ్యులందరినీ, ఇరుగుపొరుగు వారిని పిలిచి సంబరాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారి పిల్లలకు ఏవేవో గిఫ్ట్‌లు ఇస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. తమ పిల్లల కోరికలను ముందే తెలుసుకొని తీరుస్తుంటారు. అయితే అలాంటి కుటుంబానికి.. బర్త్‌డే రోజున ఓ బాలిక ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో చిన్నతనంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచింది. తనకు పుట్టినరోజు వేడుకను జరుపవద్దని.. కానీ ఓ కోరిక తీర్చమంటూ కుటుంబాన్ని కోరింది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రక్తం కొరతను నివారించడానికి రక్తదానం చేయాలని.. ఆరేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను కోరింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో జరిగింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాడా తాలూకాలోని గాండ్రే గ్రామంలో నివసిస్తున్న యుగా అమోల్ ఠాక్రేకు శనివారంతో ఆరు సంవత్సరాలు నిండాయి. అయితే.. ఏటా నిర్వహించే తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవద్దని నిర్ణయించుకుంది. దీంతోపాటు తనకేమీ బహుమతులు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించింది. బదులుగా రక్తదానం చేయాలని కుటుంబసభ్యులను కోరింది. అయితే నిత్యం రక్తదానం కోసం మీడియాలో వస్తున్న ప్రకటనల ద్వారా ఆ చిన్నారి ఈ సంకల్పాన్ని నేరవేర్చాలని నిర్ణయించుకుంది.
అయితే.. అమోల్ ఠాక్రే విజ్ఞప్తికి ఆమె కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులు స్పందించారు. ఆమె కుటుంబంలోని 36 మంది శనివారం కల్యాణి ఆసుపత్రిలో రక్తదానం చేసినట్లు డాక్టర్ వైభవ్ ఠాక్రే సోమవారం వెల్లడించారు. నిజంగా ఆ చిన్నారి ఆలోచన గొప్పదని.. ఈ వయస్సులో ఆమె తీసుకున్న ఈ చొరవ గురించి విని ఆశ్చర్యమేసిందని తెలిపారు. రక్తదానం అనంతరం రక్తాన్ని థానేలోని వామన్‌రావ్ ఓక్ బ్లడ్ బ్యాంక్‌కు పంపారు.
Also Read: