మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని గుర్తించడం కష్టమవుతుంది. అయితే, అసాధారణ రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. దీనికి ప్యాప్ స్మియర్ పరీక్ష, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అత్యంత ప్రభావవంతమైన నివారణ మార్గాలు. సర్వైకల్ క్యాన్సర్ కారణాలు, లక్షణాలు, చికిత్సలపై అవగాహన కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

మహిళకు అలర్ట్‌! సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, ప్రాణాలను రక్షించే నివారణ చిట్కాలు ఇవే!
Cervical Cancer Symptoms

Updated on: Jul 17, 2026 | 9:04 PM

ప్రస్తుత కాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా కనిపిస్తున్న మరో తీవ్రమైన సమస్య గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది గర్భాశయం కింది భాగంలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. సరైన సమయంలో గుర్తిస్తే దీనిని నివారించడం, నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ, అవగాహన లోపం వల్ల చాలామంది దీనిని చివరి దశలో గుర్తిస్తున్నారు.

సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు:

ఈ క్యాన్సర్‌కు 90శాతం కంటే ఎక్కువ కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV). ఇది శారీరక సంబంధాల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది.

చిన్న వయస్సులోనే వివాహం కావడం లేదా లైంగిక జీవితం ప్రారంభం కావడం.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ధూమపానం చేయడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గమనించాల్సిన ముఖ్యమైన లక్షణాలు:

ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి నొప్పా లేదా స్పష్టమైన లక్షణాలు ఉండవు. కానీ క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:

అసాధారణ రక్తస్రావం: పీరియడ్స్ సమయం కాకుండా మధ్యలో రక్తస్రావం కావడం లేదా మెనోపాజ్ తర్వాత కూడా బ్లీడింగ్ కావడం.

కలిసినప్పుడు నొప్పి: శారీరకంగా కలిసినప్పుడు తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం కావడం.

దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్: యోని నుండి అసాధారణంగా, దుర్వాసనతో కూడిన తెల్లబట్ట లేదా స్రవాలు రావడం.

పొత్తికడుపు నొప్పి: నిరంతరం పొత్తికడుపు లేదా నడుము భాగంలో విపరీతమైన నొప్పి ఉండటం.

ప్రాణాలను రక్షించే స్క్రీనింగ్ పరీక్ష: 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా వైద్యుల సలహాతో ప్రతి 3 నుండి 5 ఏళ్లకు ఒకసారి ప్యాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ముందే దానిని గుర్తించి నివారించవచ్చు.

చికిత్స, నివారణ మార్గాలు:

సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడానికి ప్రస్తుతం అత్యంత సురక్షితమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీనిని 9 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలికలకు ఇప్పించడం ద్వారా భవిష్యత్తులో ఈ క్యాన్సర్ రాకుండా 90శాతం వరకు అడ్డుకోవచ్చు.

ఒకవేళ క్యాన్సర్ బారిన పడితే, అది ఏ స్టేజ్‌లో ఉందనే దాన్ని బట్టి సర్జరీ, కీమోథెరపీ, లేదా రేడియేషన్ థెరపీ ద్వారా వైద్యులు చికిత్స అందిస్తారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్స ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పరిశుభ్రత, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us