
కిడ్నీల్లో రాళ్లు లేదా గాల్ స్టోన్స్ గురించి అవగాహన ఉన్నప్పటికీ, గొంతులో ఏర్పడే తెల్లటి రాళ్లు, అంటే టాన్సిల్ స్టోన్స్ (Tonsilloliths) గురించి చాలామందికి అంతగా తెలియదు. నోరు తెరిచినప్పుడు టాన్సిల్స్ ఉన్న ప్రాంతంలో చిన్న తెల్లటి, కొన్నిసార్లు పసుపురంగులో కనిపించే పదార్ధాలనే టాన్సిల్ స్టోన్స్ అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయి, ఎలాంటి సమస్యలకు దారితీస్తాయి, చికిత్స తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలపై నిపుణులు అందించిన పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరిచాం.
మన గొంతులో ఉండే టాన్సిల్స్‌పై చిన్న గుంటలు (క్రిప్ట్స్) ఉంటాయి. మనం ఆహారం తీసుకునేటప్పుడు, కూరలు లేదా పెరుగు వంటి పదార్ధాలు ఈ క్రిప్ట్స్‌లో కొద్దికొద్దిగా పేరుకుపోతాయి. కొన్నిసార్లు ఈ గుంటలు లోతుగా ఉండటం వల్ల ఆహార కణాలు లోపలికి వెళ్లిపోతాయి. క్రిప్ట్ పైభాగం సన్నగా ఉంటే, లోపల పదార్థం పేరుకుపోతూ ఉంటుంది. కాలక్రమేణా, ఈ పేరుకుపోయిన పదార్థం (డెబ్రీస్), మృత కణాలు, బ్యాక్టీరియా, శ్లేష్మం వంటివి ఒకదానికొకటి అతుక్కుని గట్టిపడతాయి. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ లేదా డెబ్రీస్ ఉన్నప్పుడు, దాని చుట్టూ ఏదో ఒకటి పేరుకుపోయి అది రాయిలా తయారవుతుంది. సరిగ్గా అదే విధంగా టాన్సిల్ స్టోన్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇవి బయటకు వస్తే తెల్లటి రాళ్లలా కనిపిస్తాయి. మరికొన్నిసార్లు అవి లోపలే ఉండి ఇన్ఫెక్షన్ వచ్చి చీముగడ్డలా పసుపు రంగులో కనిపించవచ్చు.
1. లోతైన క్రిప్ట్స్: టాన్సిల్స్ ఉపరితలంపై లోతైన గుంటలు ఉన్నవారిలో ఆహార కణాలు పేరుకుపోయే అవకాశం ఎక్కువ.
2. నోటి పరిశుభ్రత లోపం: నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, ఆహార కణాలు, చాక్లెట్లు వంటివి గుంటల్లోకి చేరి పేరుకుపోతాయి.
3. పునరావృత ఇన్ఫెక్షన్లు: దీర్ఘకాలిక టాన్సిలైటిస్ ఉన్నవారిలో టాన్సిల్స్ చుట్టూ వాపు ఏర్పడి, క్రిప్ట్స్ మూసుకుపోయి స్టోన్స్ ఏర్పడతాయి.
4. పొడి గొంతు (Dry Throat): ఎవరికైతే గొంతు ఎప్పుడూ పొడిగా ఉంటుందో, అలాంటి వారికి టాన్సిల్ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ.
*గొంతులో రాయి ఉన్నట్లు అనిపించడం, నిరంతరం అసౌకర్యం టాన్సిల్ స్టోన్స్ ప్రధాన లక్షణం. అలాగే, ఇవి ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కూడా కనిపించవచ్చు:
* గొంతు చుట్టూ ఇన్ఫ్లమేషన్.
* నోటి దుర్వాసన (బాడ్ బ్రెత్): ముఖ్యంగా పొడి గొంతు ఉన్నవారిలో లేదా టాన్సిల్ స్టోన్స్ ఎక్కువ రోజులు ఉన్నవారిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
* గొంతు పొడిబారడం.
కొన్నిసార్లు టాన్సిల్ స్టోన్స్ బయటకు కనిపించకుండా టాన్సిల్స్ లోపల భాగంలో ఉండవచ్చు. ఒకవేళ అవి నొప్పిని కలిగించకపోతే, వాపు లేకపోతే, ఎలాంటి ఇబ్బంది లేకపోతే వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నొప్పి లేదా ఇతర సమస్యలు ఉంటే, సిటి స్కాన్ వంటి పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్ లేదా చీము ఉందో లేదో నిర్ధారించి చికిత్స తీసుకోవాలి.
టాన్సిల్స్ వద్ద తెల్లటి పదార్థం కనిపించినప్పుడు, మొదట గోరువెచ్చని నీటితో పుక్కిలించడం మంచిది. సూపర్ఫిషియల్ స్టోన్స్ ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే, డీప్‌గా ఉన్న స్టోన్స్‌ను సొంతంగా చేతితో, కాటన్ బడ్స్‌తో లేదా ఇతర వస్తువులతో తీయడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా బ్లడ్ థిన్నర్స్ (యాంటీ కోయాగ్యులెంట్స్) వాడేవారు, హృదయ సంబంధిత సమస్యలు, స్ట్రోక్ చరిత్ర ఉన్నవారు, డయాబెటిస్ పేషెంట్లు అస్సలు ఈ ప్రయత్నం చేయరాదు. సొంతంగా తీయడానికి ప్రయత్నిస్తే గాయం ఏర్పడి ఇన్ఫెక్షన్ సోకి, చీము గడ్డలు (అబ్సెస్) ఏర్పడే ప్రమాదం ఉంది, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పుక్కిలించినా కూడా రాకపోతే, దగ్గరలోని ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించి వాటిని సురక్షితంగా తొలగించుకోవాలి.
చిన్న చిన్న టాన్సిల్ స్టోన్స్ అప్పుడప్పుడు ఏర్పడి, పుక్కిలించడం ద్వారా పోతున్నట్లయితే పెద్దగా చికిత్స అవసరం లేదు. అయితే, ఈ కింది సందర్భాలలో వైద్యుని సలహా తీసుకోవాలి:
ఎన్లార్జ్డ్ టాన్సిల్స్: టాన్సిల్స్ చాలా పెద్దగా ఉండి, వాటిపై తరచుగా స్టోన్స్ ఏర్పడుతుంటే వాటిని తొలగించడం మంచిది. లేదంటే పెరిటాన్సిలర్ అబ్సెస్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు.
పెద్ద స్టోన్స్ లేదా తరచుగా వచ్చే స్టోన్స్: పెద్ద పరిమాణంలో ఉన్న స్టోన్స్ లేదా పదేపదే ఏర్పడే స్టోన్స్ గొంతులో ఇన్ఫెక్షన్లు, చీము గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.
బ్యాడ్ స్మెల్: టాన్సిల్ స్టోన్స్ వల్ల నిరంతరం నోటి దుర్వాసన వస్తుంటే.
టాన్సిల్స్ చాలా పెద్దగా ఉండి, టాన్సిల్ స్టోన్స్ తరచుగా ఏర్పడుతూ, నోటి దుర్వాసన వంటి సమస్యలకు దారితీస్తుంటే టాన్సిల్స్ తొలగించే ఆపరేషన్ (టాన్సిలెక్టమీ) చేయించుకోవడం మంచిది. టాన్సిల్స్ చిన్నగా ఉండి, అప్పుడప్పుడు మాత్రమే తెల్లటి స్పాట్స్ కనిపించి, పుక్కిలిస్తే పోతుంటే, నోటి దుర్వాసన లేకపోతే ఆపరేషన్ అవసరం లేదు.
టాన్సిల్ స్టోన్స్ చూడటానికి చిన్న సమస్యగా కనిపించినా, అశ్రద్ధ చేస్తే నోటి దుర్వాసన నుండి టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్లు, పెరిటాన్సిలర్ అబ్సెస్ వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, టాన్సిల్ స్టోన్స్ ఉన్నప్పుడు సకాలంలో వైద్య నిపుణులను సంప్రదించడం అన్ని విధాలా శ్రేయస్కరం.