
ఇటీవలి కాలంలో బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఐబ్రోస్ షేప్ చేయించుకోవడం చాలా మంది మహిళల దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ముఖానికి ఆకర్షణను పెంచే ఈ త్రెడింగ్ ప్రక్రియ తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పూర్తవుతుంది. కానీ అందంపై దృష్టి పెట్టే క్రమంలో, పార్లర్‌లలో పరిశుభ్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఈ విషయాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. ఆమెకు హెపటైటిస్ బి అనే వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. త్రెడింగ్ కోసం వాడిన దారం పరిశుభ్రంగా లేకపోవడమే ఈ ఇన్ఫెక్షన్‌కు కారణమని తేలింది. కొన్ని పార్లర్‌లలో ఒకే దారాన్ని అనేక మందికి వాడటం వల్ల ఇలాంటి వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. హెపటైటిస్ బి, సి వంటి ఇన్ఫెక్షన్లతో పాటు, కొన్ని సందర్భాల్లో HIV వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఇలాంటి అపరిశుభ్రమైన పద్ధతుల ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. పరిశుభ్రత పాటించకుండా చేసే త్రెడింగ్, టాటూలు, రేజర్‌లను షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతున్నాయని తెలిపింది. ఈ వైరస్‌లు వాడిన పరికరాలపై కొన్ని రోజుల వరకు జీవించి ఉండగలవని వెల్లడించింది.
వాటిని పరిశీలించడం తప్పనిసరి..
ఆరోగ్యంగా ఉన్న శరీరంలో ఈ వైరస్‌లను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తీవ్రమైన హెపటైటిస్ బి అయితే ఆరు నెలల వరకు ఉంటుంది, ఈ సమయంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుంది. నార్మల్ హెపటైటిస్ సోకినప్పుడు చికిత్సతో త్వరగా కోలుకోవచ్చు. కాబట్టి, త్రెడింగ్ చేయించుకునే ముందు పార్లర్‌లో పరిశుభ్రత ఎలా ఉందో, వాడే సాధనాలు సురక్షితమైనవేనా అని తప్పకుండా పరిశీలించాలి. ఒక చిన్న నిర్లక్ష్యం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.