భారత్లో మధుమేహం(డయాబెటీస్) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమయిన ఈ వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం మన దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 7 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే మరో రెండురన్నర కోట్ల మంది ప్రీ డయాబెటిస్తో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సాధారణ రోగంలా అలా వదిలేయడానికి లేదు. రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు కూడా పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది. చివరికి ప్రాణాలను కూడా హరిస్తుంది. ఇది జీవన శైలి వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే శాశ్వతంగా తొలగించలేం. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవడమే శరణ్యం.
అయితే ఈ క్రమంలోనే మధుమేహం మన శరీరంలోని కొన్ని అవయవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఆయా శరీర భాగాలతో సంబంధమున్న వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుంది. మధుమేహం కారణంగా తరచుగా మూత్రవిసర్జన కావడం, దాహం పెరగడం, అలసట, అస్పష్టమైన కంటి చూపు, అనుకోకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలతోపాటు అంతర్గతంగా రక్తనాళాలు చిట్లిపోవడం, అవయవాలకు రక్తం సరఫరాలో అంతరాయం కలగడం వంటివి కూడా కనిపిస్తుంటాయి. శరీరంలో వివిధ భాగాల్లో తలెత్తే కొన్ని లక్షణాలపై ఓ కన్నేయడం చాలా అవసరం. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటీస్ సమస్య ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఆహారం, జీవనశైలి లేకపోవడం కూడా మధుమేహాన్ని స్వాగతించినట్లే అవుతుంది. అయితే మధుమేహం రాకుండా జాగ్రత్త పడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్తో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన, తక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. సరిపడినంత బరువును కలిగి ఉండేలా చూసుకోవాలి. శారీరక శ్రమ, సాధారణ వ్యాయామం అలవర్చుకోవాలి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తాగడం వంటి అనారోగ్య అలవాట్లను పరిమితం చేసుకోవాలి. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. షుగర్ జ్యూస్, అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, వైట్ రైస్, రొట్టెలు, పాస్తా, రుచిగల పెరుగు, తియ్యటి తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి తినడం మానుకోవాలి. శరీరానికి పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు అందివ్వాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ముఖ్యమైన పోషకాలను కూడా అందించే ఆహారాలను తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..