మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు!

మద్యం ఆరోగ్యానికి హానికరం అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా మంది తమ మద్యపాన వ్యసనాన్ని అధిగమించడానికి ఒక్క రోజులోనే పూర్తిగా తాగడం మానేయాలని నిర్ణయించుకుంటారు. అయితే, చాలా కాలంగా ప్రతిరోజూ లేదా అధిక పరిమాణంలో మద్యం సేవించేవారు, వైద్య సలహా లేకుండా అకస్మాత్తుగా తాగడం మానేస్తే అది ప్రమాదకరం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను వివరిస్తున్నారు.

మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్ విషయాలు!
Alcohol Withdrawal Syndrome

Updated on: Nov 27, 2026 | 11:35 AM

మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసి చాలామంది ఒక్కరోజులోనే పూర్తిగా మానేయాలని నిర్ణయించుకుంటారు. అయితే దీర్ఘకాలంగా రోజూ లేదా ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునేవారు వైద్యుల సలహా లేకుండా అకస్మాత్తుగా మానేస్తే శరీరంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అలా చేస్తే శరీరంలో ఏం జరుగుతుంది?

ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును నెమ్మదింపజేస్తుంది. నిరంతరం అధికంగా మద్యం సేవించేవారి మెదడు ఆ స్థితికి అనుగుణంగా రసాయన కార్యకలాపాలను మార్చుకుంటుంది. ఒక్కసారిగా మద్యం ఆపేసినప్పుడు మెదడులోని రసాయన సమతుల్యత దెబ్బతిని నాడీ వ్యవస్థ అతి చురుకుగా మారుతుంది. దీనినే ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు.

కనిపించే లక్షణాలు, తీవ్రత

ప్రారంభ లక్షణాలు (6–12 గంటల్లో): చేతులు, శరీరం వణకడం, అధిక చెమట, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, తలనొప్పి, వికారం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, ఆకలి తగ్గడం వంటివి కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

మూర్ఛలు, భ్రాంతులు: 8–48 గంటల్లో విత్‌డ్రాయల్ సీజర్స్ రావచ్చు. కొందరిలో లేనివి కనిపించడం, వినిపించడం వంటి భ్రాంతులు, గందరగోళం తలెత్తవచ్చు.

డెలిరియం ట్రెమెన్స్ (48–96 గంటల్లో): తీవ్ర గందరగోళం, భ్రాంతులు, అధిక చంచలత్వం, జ్వరం, చెమటలు, గుండె వేగం, రక్తపోటులో ప్రమాదకర మార్పులు కనిపిస్తాయి. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాపాయం కలగవచ్చు.

ఎవరికి ఎక్కువ ముప్పు?

ఏళ్ల తరబడి అధికంగా తాగేవారు, ఉదయం లేవగానే మద్యం అవసరమయ్యేవారు, తగ్గించినప్పుడు వణుకు లేదా చెమటలు వచ్చేవారు, గతంలో తీవ్ర లక్షణాలు లేదా మూర్ఛలు వచ్చినవారు, అలాగే కాలేయం, గుండె లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య పరీక్ష లేకుండా ఇంట్లో అకస్మాత్తుగా మానేయడానికి ప్రయత్నించకూడదు.

సురక్షితంగా మానేయడానికి ఏం చేయాలి?

మద్యం మానేయాలనే నిర్ణయం మంచిదే అయినా, అది సురక్షితంగా జరగాలి. ముందుగా మానసిక వైద్యుడిని లేదా వ్యసన చికిత్స నిపుణుడిని సంప్రదించాలి. తీవ్రతను బట్టి ఆసుపత్రిలో నిర్విషీకరణ, అవసరమైన మందులు, ద్రవాలు, థయామిన్ (విటమిన్ బి1), అలాగే కౌన్సెలింగ్, సైకోథెరపీ, కుటుంబ మద్దతుతో చికిత్స కొనసాగించాలి. మూర్ఛలు, తీవ్ర గందరగోళం, భ్రాంతులు, జ్వరం లేదా స్పృహలో మార్పులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. మద్యం మానేయడాన్ని వాయిదా వేయవద్దు. కానీ వైద్య సహాయం లేకుండా ప్రమాదకరంగా హఠాత్తుగా ఆపవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us