
మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధనల ప్రకారం.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం చాలా మేలు చేస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి పెద్దపేగు క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ ప్రమాదం తగ్గించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ, బార్లీ, రాగి, ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటి సంపూర్ణ ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచి కడుపు, పేగులు, పెద్దపేగు క్యాన్సర్లను నివారిస్తాయి.
శనగలు, మినుములు, మసూర్ పప్పు, రాజ్మా వంటి పప్పుల్లో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడికాయ, మునగకాయ, పాలకూర, మెంతికూర వంటి కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జామ, బొప్పాయి, అరటిపండు, యాపిల్ (తొక్కతో), సపోటా, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.
బాదం, వాల్నట్, పిస్తా, నువ్వులు, చియా గింజలు, అవిసె గింజల్లో ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి పెద్దపేగు క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.
మొత్తంగా రోజూ మనం తినే ఆహారంలో పైన చెప్పిన పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)