వివాహం అయిన తర్వాత పురుషులు, మహిళల్లో చాలా మార్పులు వస్తాయి.. ముఖ్యంగా వివాహం జరిగిన వెంటనే పురుషులు బరువు పెరగడం ప్రారంభిస్తారు.. ఈ విషయాన్ని అందరూ గమనించే ఉంటారు.. ఎందుకంటే దాదాపుగా అందరి భర్తల పరిస్థితి ఇదే ఉంటుంది.. బెల్లీ ఫ్యాట్, ఊబకాయం సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. అయితే.. పెళ్లి తర్వాత ఊబకాయం గురించి కొందరు హస్యాస్పదంగా ఎగతాళి కూడా చేస్తుంటారు.. భార్య చేతులతో ప్రేమగా ఆహారం తినడం వల్ల కలిగే ఫలితం అంటూ నవ్వులు పూయిస్తుంటారు.. కానీ వాస్తవానికి, ఇది చిన్న సమస్య కాదు… పెద్ద సమస్యేనంటూ పరిశోధకులు చెబుతున్నారు.
పోలాండ్‌లోని వార్సాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో, పెళ్లికాని పురుషులతో పోలిస్తే వివాహిత పురుషులకు ఊబకాయం వచ్చే ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అదే సమయంలో, ఈ పెరుగుదల మహిళల్లో 39 శాతంగా కనిపించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
పోలాండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు 2,405 మంది వ్యక్తుల నుంచి డేటాను విశ్లేషించారు.. వీరిలో ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారున్నారు.. ఈ వ్యక్తులలో, 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉన్నారు, 38.3 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారు మరియు 26.4 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. వివాహం పురుషులలో ఊబకాయం ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ ప్రభావం మహిళల్లో తక్కువగా కనిపించింది.
వయస్సుతో పాటు బరువు పెరిగే అవకాశం పెరుగుతుందని కూడా అధ్యయనం వెల్లడించింది. పెరుగుతున్న వయస్సుతో, బరువు పెరిగే అవకాశం ప్రతి సంవత్సరం పురుషులలో 3 శాతం, స్త్రీలలో 4 శాతం పెరుగుతుంది. అదే సమయంలో, ఊబకాయం ప్రమాదం పురుషులలో 4 శాతం, స్త్రీలలో 6 శాతం పెరుగుతుంది.
వివాహం తర్వాత పురుషులలో బరువు పెరగడానికి ప్రధాన కారణాలు – ఆహారం తీసుకోవడం పెరగడం, సామాజిక ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలు తగ్గడం అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
దీని గురించి, ఒబేసిటీ హెల్త్ అలయన్స్ డైరెక్టర్ అయిన కేథరీన్ జెన్నర్ మాట్లాడుతూ.. ఊబకాయం అనేది కేవలం వ్యక్తిగత ఎంపికల ఫలితం కాదని, ఇది సామాజిక, మానసిక, పర్యావరణ అంశాల కలయిక అని.. దీనికి ఈ అధ్యయనం మరొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
వివాహం తర్వాత పురుషుల జీవనశైలి మారుతుందని, ఇది వారి బరువును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ముఖ్యంగా వారి ఆహారపు అలవాట్లు, పని జీవనశైలిని పరిగణనలోకి తీసుకుంటే.. పురుషుల ఆరోగ్యానికి మరింత లక్ష్య వ్యూహం అవసరం.. దీనిద్వారా ఈ సమస్యను అధిగమించగలరు..
ముందుగా కొవ్వు పదార్థాలను నియంత్రించాలి.. అలాగే ఎక్కువ తినే అలవాటును నియంత్రించడం.. సమపాళ్లల్లో పోషకాలను తీసుకోవడం, వ్యాయామం, తగినంత నిద్ర లాంటి వాటిద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..