
దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతంగా పేరుగాంచిన ఈశాన్య భారతదేశం నుంచి ఆందోళన కలిగించే ఆరోగ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన భారీ స్క్రీనింగ్ కార్యక్రమంలో వేలాది మంది లక్షణాలు లేకుండానే టీబీ బారిన పడినట్లు గుర్తించడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. సాధారణంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలతో టీబీని గుర్తిస్తారు. అయితే తాజాగా బయటపడిన గణాంకాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తున్నాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం, జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించారు. బలహీన వర్గాలు, ప్రమాదంలో ఉన్న సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 41,727 మంది టీబీ రోగులను గుర్తించారు. వీరిలో 14,356 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. అంటే మొత్తం కేసుల్లో సుమారు 34 శాతం మంది తమకు టీబీ సోకిన విషయం తెలియకుండానే సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారని అర్థం.
టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 39 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో దాదాపు 6 లక్షల మందికి ఛాతీ ఎక్స్-రేలు కూడా తీశారు. ఈ చురుకైన తనిఖీల వల్ల సాధారణంగా ఆసుపత్రులకు వెళ్లని రోగులను గుర్తించడం సాధ్యమైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు లేని టీబీ కేసులు అత్యధికంగా అస్సాంలో 10,362 నమోదయ్యాయి. మేఘాలయలో 1,055, నాగాలాండ్‌లో 857, త్రిపురలో 510 కేసులు గుర్తించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో 479, మణిపూర్‌లో 465, సిక్కింలో 380, మిజోరంలో 248 కేసులు నమోదయ్యాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, లక్షణాలు లేకపోవడం టీబీ నియంత్రణలో పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి వ్యక్తులు చికిత్స పొందకుండా చాలా కాలం ఉండిపోవచ్చు. దీనివల్ల వ్యాధి ఇతరులకు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆరోగ్య శాఖ ఆసుపత్రులకు వచ్చే వారిపై మాత్రమే ఆధారపడకుండా ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తోంది.
టీబీని ముందుగానే గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. మేఘాలయలో ‘కాఫ్ ఎగైనెస్ట్ టీబీ’ యాప్‌తో పాటు ఏఐ ఆధారిత పోర్టబుల్ ఎక్స్-రే యూనిట్లను ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్ 2025 నాటికి ఈశాన్య ప్రాంతంలో 10.7 లక్షలకు పైగా టీబీ అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం ఈ ప్రచారం తీవ్రతను చూపిస్తోంది. ప్రజల్లో అవగాహన పెంపు, ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స ద్వారానే టీబీ నిర్మూలన సాధ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..