స్వీట్స్ తిన్న వెంటనే నీరు తాగుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

చక్కెర తిన్న తర్వాత నీరు త్రాగడం ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా..? రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, దంత ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయా..? లేదా నష్టాలు ఉంటాయా..? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్వీట్స్ తిన్న వెంటనే నీరు తాగుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
Sweets

Updated on: Mar 16, 2025 | 8:42 AM

చాలా మంది భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినడం ఇష్టపడతారు. ఇది అలవాటుగా మారిపోయింది. కానీ అధికంగా స్వీట్లు తింటే పేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని గుర్తుంచుకోవాలి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రకారం తీపి తిన్న తర్వాత నీరు త్రాగితే దాని ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత కోసం న్యూట్రిషన్‌ నిపుణులు అభిప్రాయాన్ని వెల్లడించారు.

రక్తంలో చక్కెర స్థాయిలు

స్వీట్లు తిన్న వెంటనే నీరు త్రాగితే, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నియంత్రించవచ్చు. ఎందుకంటే నీరు త్రాగకపోతే శరీరం త్వరగా నిర్జలీకరణం చెందుతుంది. దీని ప్రభావంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. నీరు త్రాగడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

జీర్ణ వ్యవస్థ

భోజనం చేసిన తర్వాత నీరు త్రాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా నీరు త్రాగడం వల్ల ప్రేగుల కదలికలు క్రమంగా కొనసాగుతాయి.

దంత ఆరోగ్యం

స్వీట్లు తిన్న తర్వాత నోటిలో మిగిలిన ఆహారపు కణాలు బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. దీని వల్ల దంతక్షయం, నోటి సమస్యలు రావచ్చు. కానీ నీరు త్రాగడం వల్ల నోటిలో మిగిలిన ఆహార కణాలు బయటికి పోయి, దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జాగ్రత్తలు

స్వీట్లు తినేటప్పుడు కొంతమంది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లేదా ప్రోటీన్ కలిపి తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఉదాహరణకు నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలతో తింటే ప్రయోజనం ఉంటుంది.

ప్రాసెస్ చేసిన తెల్ల చక్కెర బదులుగా అరటిపండ్లు, యాపిల్‌సాస్, ఖర్జూరం వంటి సహజ తీపి పదార్థాలతో చేసిన స్వీట్లు తీసుకోవచ్చు. లేకపోతే బ్రౌన్ షుగర్ లేదా బెల్లంతో చేసిన స్వీట్లు ఆరోగ్యానికి మంచివి.

అధికంగా స్వీట్లు తినడం వల్ల పేగుల పనితీరు దెబ్బతింటుంది. అందుకే తక్కువ పరిమాణంలో స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

స్వీట్లు తిన్న వెంటనే నీరు త్రాగడం ఆరోగ్య పరంగా కొన్ని ప్రయోజనాలను ఇస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, దంత ఆరోగ్య రక్షణకు సహాయపడుతుంది. అయితే ఆరోగ్యకరమైన స్వీట్లు ఎంచుకోవడం, పరిమితంగా తినడం కూడా చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)