40 ఏళ్లు దాటిన మగవారికి అలర్ట్.. గుండెను దెబ్బతీసే నిద్ర అలవాటు ఇదే..!

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా.. ‘బీఎంసీ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్’ 10 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి నిద్రకు ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి జర్నల్‌ను ప్రచురితం చేసింది. దీని ప్రకారం 40 ఏళ్లు దాటిన మగవారు నిద్రకు సంబంధించి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని సూచిస్తుంది.

40 ఏళ్లు దాటిన మగవారికి అలర్ట్.. గుండెను దెబ్బతీసే నిద్ర అలవాటు ఇదే..!
Alert For Men Over 40 Years

Updated on: Nov 19, 2026 | 6:05 PM

వినడానికి కొంచెం షాకింగ్‌గా అనిపిస్తున్నా కానీ ఇది ఒకరకంగా మగవారికి హెచ్చరిక అనే చెప్పాలి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా.. ‘బీఎంసీ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్’ 10 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి నిద్రకు ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి జర్నల్‌ను ప్రచురితం చేసింది. దీని ప్రకారం.. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ప్రతీరోజూ ఒకే సమయానికి కాకుండా.. వేర్వేరు సమయాల్లో నిద్రపోయే అలవాటు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. మరీ ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మగవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని సూచిస్తుంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

మిస్ అవుతున్న మంచి నిద్ర..

సాధారణంగా మంచి నిద్ర అంటే.. రోజూ రాత్రి కనీసం 8 గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం. సాధారణంగా అందరూ పాటించే లెక్క ఇదే. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన పురుషులు ఆఫీసు ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతల మధ్య రాత్రిళ్లు ఆలస్యంగా పడుకున్నప్పటికీ.. ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు. ఆ లెక్కన చూస్తే ఎలాగోలా 8 గంటల నిద్ర పూర్తి చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ నిద్ర విషయంలో మనం పట్టించుకోని మరో ముఖ్యమైన అంశం ఒకటుందని హెచ్చరిస్తున్నారు. అదే మీ గుండెను నిశ్శబ్దంగా దెబ్బతీస్తోందని తాజా పరిశోధన వెల్లడిస్తుంది.

10 ఏళ్ల పరిశోధనలో ఏం తేలింది..?

పరిశోధకులు 46 ఏళ్ల వయసున్న 3,231 మంది నిద్రవేళలను నిశితంగా పరిశీలించారు. వారి రోజువారీ నిద్ర, మేల్కొనే సమయాలను నమోదు చేసి.. ఆ తర్వాత పదేళ్ల పాటు వారి వైద్య రికార్డులను ట్రాక్ చేశారు. ఈ పదేళ్ల కాలంలో 128 మంది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల బారిన పడ్డట్టు గుర్తించారు. వీరిలో కొందరికి గుండెపోటు, స్ట్రోక్.. హార్ట్ ఫెయిల్యూర్ రాగా, మరికొందరు గుండె సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI), కొలెస్ట్రాల్ వంటి ఇతర ఆరోగ్య అంశాలను పక్కన పెట్టి చూసినప్పుడు.. గుండె సమస్యలు వచ్చిన వారందరిలో ఒకే ఒక్క కామన్ పాయింట్ కనిపించింది.

అదేంటంటే.. వారంతా ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్రపోయేవారు కాదని తేలింది. ఒకరోజు రాత్రి 10 గంటలకు పడుకుంటే.. మరోరోజు ఒంటిగంటకు, ఇంకోరోజు 11 గంటలకు.. ఇలా వారి నిద్ర వేళలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిర్ధారించారు. నిద్రవేళలు మారుతూ ఉండటంతో పాటు రోజుకు 8 గంటల కంటే తక్కువగా నిద్రపోయే పురుషుల్లో గుండె జబ్బుల ముప్పు రెట్టింపు అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఉదయం వేర్వేరు సమయాల్లో నిద్రలేవడం వల్ల గుండెపై అంతగా ప్రభావం పడలేదు కానీ.. రాత్రి పడుకునే సమయం మారడమే అసలు సమస్యగా మారిందని యూనివర్సిటీ ఆఫ్ ఔలు పరిశోధకురాలు ఈ అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ లారా నౌహా స్పష్టం చేశారు.

నిద్ర వేళలు మారితే గుండెకు ఎందుకు ప్రమాదం?

మన శరీర పనితీరు ‘సర్కాడియన్ రిథమ్’ అనే అంతర్గత జీవ గడియారం ఆధారంగా నడుస్తుంది. మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు మేల్కొనాలి అనే విషయాలను ఈ 24 గంటల జీవ గడియారమే నియంత్రిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలోని హార్మోన్ల హెచ్చుతగ్గులు, గుండె లయ, రక్తపోటు (BP) కూడా దీని ఆధీనంలోనే ఉంటాయని యూటీహెల్త్ హ్యూస్టన్ నిద్ర వైద్య నిపుణురాలు డాక్టర్ సుధ తల్లవజ్జుల వివరించారు. పురుషులు తమ ఆఫీసు పనులు, మొబైల్ వాడకం లేదా ఇతర కారణాల వల్ల ప్రతీరోజూ నిద్రపోయే సమయాన్ని మారుస్తుంటే.. ఈ జీవ గడియారం గతి తప్పుతుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ గ్రాంట్ బెయిలీ చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు, అడ్రినలిన్ స్థాయిలు పెరిగి గుండె వేగం, రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు.

గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే..

సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీరం.. అంతర్గత మరమ్మతు పనులను చేసుకుంటుంది. హార్మోన్ల సమతుల్యత, మెదడు, గుండెకు విశ్రాంతి లభించేది కూడా ఈ సమయంలోనే. అందుకే నిద్ర వేళలు సరిగ్గా లేకపోతే గుండె నిరంతరం ఒత్తిడిలోనే ఉండిపోతుంది తప్ప, దానికి కోలుకునే సమయం దొరకదని చెబుతున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన పురుషులు కేవలం ఎన్ని గంటలు నిద్రపోతున్నామనే దానిపైనే కాకుండా.. నిద్ర నాణ్యతతో పాటు ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్రపోవడంపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us