భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 2022 ICMR అధ్యయనం ప్రకారం ప్రతి తొమ్మిది మంది భారతీయులలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ.. వ్యాధి లక్షణాలు, అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా పద్ధతులపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. ఎంఎస్‌డీ ఫార్మాసీటికల్, టీవీ9తో కలిసి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వైద్య నిపుణులతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. డా. వంశీకృష్ణ (AIG హాస్పిటల్) ప్రకారం క్యాన్సర్ లక్షణాలు అది మొదలైన ప్రదేశాన్ని బట్టి మారుతాయని వివరించారు. అసాధారణమైన శరీర మార్పులు, ఒక్కసారిగా బరువు తగ్గడం, అధిక బలహీనత, లేదా ఎక్కడైనా గడ్డలు, రక్తస్రావం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి క్యాన్సర్ కాకపోయినా.. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి దీనికి కారణాలను నిర్ధారించుకోవడం మంచిది.
డా. సాయినాథ్ (స్టార్ హాస్పిటల్), డా. మౌనిక బొప్పన (కిమ్స్ హాస్పిటల్) సాంప్రదాయ చికిత్సా పద్ధతులైన సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ గురించి వివరించారు. ట్యూమర్ రకం, స్థానం, దశ ఆధారంగా ఈ చికిత్సలు ఉపయోగించబడతాయి. కొన్ని సందర్భాలలో, ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించడానికి సర్జరీకి ముందు కీమో లేదా రేడియేషన్ అవసరం కావచ్చు. అధునాతన చికిత్సా విధానాలలో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ మన రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్ తో పోరాడేలా చేస్తుంది. ఇది కేవలం చివరి దశ క్యాన్సర్లకే కాకుండా, కొన్ని క్యాన్సర్లలో ప్రారంభ దశలలో కూడా ఉపయోగించబడుతుంది. ప్రజలు క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం చాలా ముఖ్యమని ఈ కార్యక్రమం నొక్కి చెప్పింది.