Vijayashanti: రాములమ్మ ఉగ్రరూపం.. సినిమాను బ్రతకనివ్వండి అంటూ ఆక్రోషం

బాగున్న సినిమాను బాగాలేదని ప్రచారం చేయడం, బాలేని సినిమాను నెత్తికెత్తుకోవడం.. ఏం పద్ధతి..? థియేటర్లలో ప్రేక్షకులు సినిమా నచ్చిందని చూసి సంతోషిస్తుంటే.. ఆ సినిమా బాలేదని ప్రచారం చేసేంత శాడిజం ఎందుకు? అంటూ సినీ ప్రముఖులు ఫైర్‌ అవుతున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది.

Vijayashanti: రాములమ్మ ఉగ్రరూపం.. సినిమాను బ్రతకనివ్వండి అంటూ ఆక్రోషం
Vijayashanti

Updated on: Apr 20, 2025 | 8:08 PM

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి మూవీని ఖూనీ చేద్దామనుకునేవారికి ఇదే మా హెచ్చరిక అంటూ విరుచుకుపడ్డారు నటి విజయశాంతి. తప్పుడు ప్రచారం చేసే వారు పద్ధతి మార్చుకోకపోతే అసలు ఊపేక్షించే పరిస్థితే లేదన్నారు. కొంత మంది కావాలనే ఇబ్బందిపెడుతున్నారన్నది రాములమ్మ చెబుతున్న మాట. బావున్న సినిమాను బాలేదని ప్రచారం చేయడమేంటని నిలదీశారు విజయశాంతి.

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నచ్చకపోతే చూడ్డం మానేయండి.. నిశ్శబ్దంగా ఉండండి అంటూ హితవు పలికారు. నచ్చలేదని చెప్పి మొత్తం సినిమాను చంపేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు నచ్చిన సినిమాలను.. బాలేదని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందడమేంటన్నారు. మంచి సినిమాలను చంపే హక్కు ఎవరికీ లేదు. చీప్‌ పనులు మానుకోవాలని సూచించారు విజయశాంతి.

కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన సినిమా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో నెగెటివ్‌ రివ్యూల మీద విరుచుకుపడ్డారు విజయశాంతి. ఈమె మాటలు వైరల్‌ కావడంతో, రీసెంట్‌గా సూర్యదేవర నాగవంశీ చెప్పిన మాటలను కూడా గుర్తుచేసుకుంటున్నారు జనాలు. మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎందుకింత శాడిజం? అంటూ నాగవంశీ చేసిన కామెంట్ల మీద కూడా డిస్కషన్‌ షురూ అయింది.

రీసెంట్‌గా మ్యాడ్‌ స్క్వేర్‌ రిలీజ్‌ అయినప్పుడు రివ్యూయర్ల గురించి మాట్లాడారు నాగవంశీ. పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారన్నారు. అసలు తన సినిమాలను బ్యాన్‌ చేయమని, రివ్యూలు రాయొద్దని, తన సినిమా కంటెంట్‌ని ఆపేయమని కూడా సవాలు విసిరారు నాగవంశీ.

విజయశాంతి, నాగవంశీ మాత్రమే కాదు.. మన దగ్గర రివ్యూల మీద అడపాదడపా స్పందిస్తున్నవారున్నారు. తమిళనాడులో నిర్మాతల మండలి యూట్యూబర్లను కట్టడి చేయడానికి ప్రయత్నించింది. కంగువ సినిమాకు నెగటివ్‌ రివ్యూలు వచ్చినప్పుడు జ్యోతిక చేసిన కామెంట్లు కూడా అప్పట్లో వైరల్‌ అయ్యాయి. సినిమాలు చూడటం చేతకానివారు రివ్యూలిస్తున్నారని అప్పట్లో గట్టిగా ఫైర్‌ అయ్యారు జ్యోతిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..