
తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటీమణులలో నిర్మలమ్మ ఒకరు. గయ్యాలి అత్త అనగానే సూర్యకాంతం గుర్తుకొచ్చినట్లు, బామ్మ అనగానే నిర్మలమ్మ మదిలో మెదులుతారు. మంచి బామ్మ, చిలిపి బామ్మ, దొంగ బామ్మ, విలన్ బామ్మ… ఇలా ఏ పాత్రైనా నిర్మలమ్మ తన నటనతో జీవం పోశారు. కొంగు లాగి బిగించి కొడుకునో, మనవడినో తిట్ల దండకం అందుకునే నిర్మలమ్మను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. మహానటుల నుంచి హాస్యనటుల వరకు ఎందరికో అమ్మగా, మరెందరికో బామ్మగా నటించిన ఆమె అసలు పేరు రాజమణి. 1927 నవంబరులో మచిలీపట్నంలో జన్మించారు. పదేళ్ల వయసులోనే “ప్రేమలీల” నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన నిర్మలమ్మ.. ఆకలి, సక్కుబాయి, కన్యాశుల్కం, ఏకవీర వంటి నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాకినాడలో “కరువు రోజులు” నాటకంలో ఆమె నటనను చూసిన బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ గొప్ప నటివి అవుతావని ఆశీర్వదించారు. 19వ ఏట జీవీ కృష్ణారావుతో వివాహం కుదిరినప్పుడు, నాటకాల్లో వేయనిస్తేనే పెళ్లి అని షరతు విధించి తాళి కట్టించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఏడేళ్లు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రసారమయ్యే వందలాది నాటకాల్లో పాల్గొని, తన వాచకంతో ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందారు. అయితే, సినీ రంగానికి వచ్చిన తర్వాత ఆమె గొంతు పనికిరాదని హేళన చేయడం విచిత్రం.
నిర్మలమ్మ హీరోయిన్‌గా పరిశ్రమకు పరిచయం కావాలనే ప్రయత్నాలు జరిగాయి. యవ్వనంలో ఆమె అందం ఏ హీరోయిన్‌కు తగ్గదని చెప్పేవారు. “మనవాళ్ళే” చిత్రంలో హీరోయిన్ వేషం వచ్చినా, కొత్త హీరో వల్లం నరసింహారావుతో పాటు ఆమెనూ తొలగించారు. అంజలీదేవి ఆమెకు మానసిక స్థైర్యం కల్పించారు. “బంగారు పాప” వంటి చిత్రాలకు మరీ బక్కగా ఉందని తిరస్కరించబడ్డారు. దాంతో నిరాశ చెంది మద్రాసు వదిలి విజయవాడ వెళ్లి మళ్లీ నాటకాలు ప్రదర్శించారు. రెండేళ్ల తర్వాత భర్తకు మద్రాసులో ఉద్యోగం రావడంతో తిరిగి సినీ రంగానికి చేరుకున్నారు. సారథీ వారి “ఎత్తుకు పైఎత్తు” చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసినా, “భాగ్యదేవత”లో సావిత్రికి అమ్మగా నటించమని అడిగినప్పుడు, సావిత్రి, నిర్మల అక్కాచెల్లెళ్లలా ఉన్నారని ప్రేక్షకులు భావించడంతో ఆమెలో భయం పట్టుకుంది. అయితే, తన వయసుకు మించిన అమ్మ, బామ్మ పాత్రలను స్వీకరించి వాటికి తనదైన శైలిలో ప్రాణం పోశారు. “పొట్టి ప్లీడర్”లో పెద్దమ్మగా, “మనుషులు మారాలి”లో ఏకంగా అమ్మమ్మగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు వంటి తనకంటే పెద్ద వయసు నటులకు కూడా తల్లిగా నటించి మెప్పించారు. “కులగోత్రాలు”, “స్వాతిముత్యం”, “మయూరి”, “శంకరాభరణం”, “గ్యాంగ్ లీడర్” వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. 1980 వరకు తల్లి పాత్రల్లో నటించిన ఆమె, ఆ తర్వాత బామ్మ పాత్రలకు మారారు. దాదాపు 800 చిత్రాల్లో నటించిన నిర్మలమ్మ, తన మనసుకు హత్తుకున్నవి “కులగోత్రాలు”, “స్వాతిముత్యం”, “మయూరి” అని చెప్పేవారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు. 43 ఏళ్ల నట జీవితం తర్వాత, 72 ఏళ్ల వయసులో స్వీయ విరమణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శరీరం సహకరించనప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొందరు దర్శకుల ఒత్తిడి మేరకు అడపా దడపా కొన్ని పాత్రలు పోషించారు. “ప్రేమకు స్వాగతం” ఆమె చివరి చిత్రం. కృష్ణారావు, నిర్మలమ్మ దంపతులకు పిల్లలు లేరు; దత్తపుత్రి కవిత, అల్లుడు ప్రసాద్. తెర మీదే కాదు, నిజజీవితంలోనూ అందరితోనూ ఆప్యాయంగా మెలిగిన నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19న కన్నుమూశారు. హెచ్.ఎం. రెడ్డి, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి వంటి దిగ్గజ దర్శకులతో పనిచేయలేకపోయానని బాధపడేవారు. రఘుపతి వెంకయ్య వంటి అవార్డులు తనలాంటి నటీమణులకు అందుబాటులో ఉండవని ఆమె అభిప్రాయపడ్డారు. నిర్మలమ్మ వారసులు చిత్ర పరిశ్రమలో లేరు, కానీ ఆమె నటన వారసత్వం మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ సజీవమే.
వెన్నుముక విరిగినా వెనకడుగు వేయలేదు.. నూటొక్క జిల్లాల అందగాడి విషాద గాథ