
ప్రేక్షకుల ఊహలకు అందని కాన్సెప్టులతో సినిమాలు తీసి భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు తెరకెక్కించిన సింగీతం సెల్యులాయిడ్ సైంటిస్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు. కేవలం దర్శకత్వంలోనే కాదు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన.. తదితర రంగాల్లోనూ సింగీతం తన ట్యాలెంట్ చూపించారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ఇంకా ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అపూర్వ సహోదరులు’.. ఇలా సింగీతం కెరీర్ లో ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. చివరకు 95ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ (2026) అనే మ్యూజిక్ ఫాంటసీ సినిమాను ఆడియెన్స్ కు అందించిన సింగీతం అక్టోబర్ 04న తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే సింగీత ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. చివరకు సింగీతం శ్రీనివాసరావు తన ఫ్యామిలీ గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఎక్కడా కానీ ఆయన తన ఫ్యామిలీ కానీ, వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు . అయితే ఇప్పుడు సింగీతం మరణం నేపథ్యంలో ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సింగీతం శ్రీనివాస్ రావు 1960లో లక్ష్మీ కల్యాణిని వివాహం చేసుకున్నారు. లక్ష్మీ కల్యాణిది కూడా సినిమా నేపథ్యమే. మంచి రచయిత కూడా. శ్రీ కల్యాణీయం అనే పుస్తకాన్ని రచించిన లక్ష్మీ కల్యాణి నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ చిత్రానికి సృజనాత్మక భాగస్వామి, సహ రచయిత్రిగా కూడా పనిచేశారు. సింగీతం కష్ట సుఖాల్లోనూ కలిసి నడిచిన ఆమె అనారోగ్య సమస్యలతో 2022 మే 28న తుదిశ్వాస విడిచారు. ఇకపోతే సింగీతం, లక్ష్మీ కళ్యాణి దంపతుల పిల్లల విషయానికి వస్తే.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఇదిలా ఉంటే సింగీతం కుమారుడు 39 సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సింగీతంకు సుధా కార్తీక్ అనే అమ్మాయి కూడా ఉంది. ఈమె కూడా మంచి రచయితనే. తల్లి రాసిన శ్రీ కళ్యాణీయం అనే పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు సుధా కార్తీక్. అనంతరం ఇదే పుస్తకాన్ని ఈమె కుమారుడు, సింగీతం శ్రీనివాసరావు మనవడు అభినవ్ ఈ – బుక్ వెర్షన్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగానే 2021 నవంబర్ 16న తన మనవడికి శుభాకాంక్షలు చెబుతూ ఒక ఎమోషనల్ పోస్టు కూడా పంచుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ‘ఒక గర్వపడే తండ్రిగా నా భార్య సింగీతం లక్ష్మీ కళ్యాణి తెలుగులో రచించిన శ్రీ కళ్యాణీయం గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించి, ఆవిష్కరించిన నా కుమార్తె సుధా కార్తీక్ కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే పుస్తకాన్ని ఆన్ లైన్ వెర్షన్ లో ఆవిష్కరించిన నా మనవడు అభినవ్ కి నా శుభాకాంక్షలు’ అంటూ అప్పట్లో రాసుకొచ్చారు సింగీతం. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.