
యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరా తన జీవితంలోని కొన్ని చీకటి అధ్యాయాలను, ముఖ్యంగా విడాకుల అనంతర కాలంలో తాను అనుభవించిన ఒంటరితనం, ఆ తర్వాత ఒక పనిమనిషి వల్ల ఎదురైన నమ్మక ద్రోహం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ అనుభవాలు తన జీవితం, మనుషులపై నమ్మకం, ఆర్థికపరమైన దృక్పథాన్ని ఎలా మార్చివేశాయో స్పష్టం చేశారు. విడాకుల తర్వాత తాను తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొన్నానని ప్రసాద్ బెహరా తెలిపారు. ఈ పరిస్థితిలో తనకు తోడుగా, వినోదంగా ఉండేందుకు ఒక పనిమనిషిని నియమించుకున్నానని చెప్పారు. సాధారణంగా రూ. 3,000 జీతం అడిగిన ఆమెకు, తాను రూ. 6,000 జీతం ఇచ్చానని, తనతో మాట్లాడుతూ, తన వీధిలో జరిగిన కథలు చెప్పాలని కోరానని వివరించారు. ఆమెను కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటూ, వారానికి ఒక కేజీ మటన్ కొనివ్వడం, వారానికి నాలుగు రెగ్యులర్ సీట్ల సినిమా టికెట్లను ఆమె కుటుంబ సభ్యులందరికీ ఇప్పించడం, సరుకులు, బియ్యం వంటివి కూడా స్వైప్ చేసి కొనిచ్చానని ప్రసాద్ పేర్కొన్నారు. ఆమెకు పని చాలా తక్కువ ఉండేదని, కేవలం ఇల్లు శుభ్రం చేసి, పాత్రలు తోమి, తనతో మాట్లాడుతూ ఉండటమే ఆమె పని అని ఆయన చెప్పారు.
అయితే, ఒకరోజు తన ఖరీదైన వాచీలు – నాలుగు కాస్ట్లీ వాచీలతో పాటు ఒక ఆపిల్ వాచ్ – కనిపించకుండా పోయాయని ప్రసాద్ బెహరా చెప్పారు. ఆపిల్ వాచ్ను ఆమె చీర కొంగున కట్టుకొని వెళ్తుండగా, సెక్యూరిటీ బజర్ మోగడంతో ఆమె దొరికిపోయిందని ఆయన వివరించారు. ఈ సంఘటన తర్వాత, ఆమె దొంగతనం పట్ల పశ్చాత్తాపపడకుండా, ఆ వస్తువులను కొన్న వ్యక్తి తనకు కేవలం రూ. 400 మాత్రమే ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేసిందని ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తనకు తీవ్రమైన ఆవేదన కలిగించిందని, “నాలా చూసుకునే తమ్ముడు నీకు దొరికితే వాడిని తీసుకురా, నీ తమ్ముడు కూడా నిన్ను అలా చూసుకొని ఉండడు” అని ఆమెతో చెప్పి, తన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరానని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ ఘటన ప్రసాద్ బెహరా జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని, అప్పటి నుంచి మనుషులను నమ్మడం మానేశానని తెలిపారు. ఇప్పుడు ఎవరైనా ప్రేమగా పలకరించినా, ఆహారం ఇచ్చినా తాను నమ్మడం లేదని పేర్కొన్నారు. డబ్బు పట్ల తన దృక్పథం కూడా మారిందని, సంపాదించిన డబ్బును సేవింగ్స్ చేయకుండా, తన కోరికల కోసం ఖర్చు చేసుకుంటున్నానని ప్రసాద్ బెహరా చెప్పారు. “ఈ నెల అంతా లక్ష రూపాయలు వచ్చిందనుకో, 20 వేల షూ, 10 వేల షర్ట్ అలా మెయింటైన్ చేసే రేంజ్ కూడా కాదు నాది, ఎందుకు దాచుకోవాలి?” అని ప్రశ్నించారు. “ఎవడైనా వచ్చి బాబు డబ్బులు లేవు బాబు అంటే, ఓకే లేవా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నా అని అన్నారు. పేదల పట్ల కూడా తన మనసు కర్కశంగా మారిందని, “సంపాదించుకోవడం చేత కాకపోతే పేదరికం వస్తుంది” అనే స్థాయికి తాను చేరిపోయానని తెలిపారు. చిన్న చిన్న అప్పులు తప్ప పెద్ద కష్టాలు లేవని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని ప్రసాద్ బెహరా అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి