
తెలుగు చలనచిత్ర చరిత్రలో సురభి బాలసరస్వతి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఒక తరం ప్రేక్షకులను తన నటన, విశిష్టమైన కళ్లతో ఆకట్టుకున్న ఈ వెండితెర తార ప్రస్థానం రంగస్థలం నుంచి ప్రారంభమైంది. రేలంగి, రమణారెడ్డి వంటి హాస్యనటులతో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. 1948లో “ద్రోహి” చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన బాలసరస్వతి, 1976లో “దొరలు దొంగలు”తో తన సినీ ప్రస్థానాన్ని ముగించారు. సురభి బాలసరస్వతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సురభి నాటక సమాజం వారసురాలు. 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో వనారస గోవిందరావు చేత స్థాపించబడిన ఈ సమాజం, నాటకరంగానికి ఎనలేని సేవలు అందించింది. ఆడపాత్రలను ఆడవారితోనే ప్రదర్శింపజేసిన తొలి నాటక సమాజంగా సురభి ఖ్యాతి గాంచింది. సమిష్టి కృషి, వారసత్వం, భక్తిభావం, పట్టుదలకు ఈ సంస్థ పెట్టింది పేరు.
సురభి నాటక సమాజం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి తరం నటి సురభి కమలాబాయి. బాలసరస్వతి కమలాబాయి అక్క కూతురు. ఉత్తరాంధ్రలోని పొందురులో జన్మించిన బాలసరస్వతి ఐదవ ఏటనే రంగప్రవేశం చేశారు. ఆమె నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. వంశ పారంపర్యంగా వస్తున్న కళాకారుల వృత్తి కావడంతో చిన్నతనం నుండే నటనకు అలవాటు పడ్డారు. “రాణి ప్రమీల”, “బాలనాగమ్మ”, “భక్త ప్రహ్లాద” వంటి నాటకాలలో ప్రాణం పోసిన బాలసరస్వతి, స్త్రీ పాత్రలతో పాటు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురుష పాత్రలను కూడా అద్భుతంగా పోషించారు. పౌరాణిక నాటకాలతో పాటు “ఈనాడు”, “పరివర్తన”, “ఎదురీత” వంటి సాంఘిక నాటకాలలోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించారు. విజయవాడలో జరిగిన నాటక పరిషత్ పోటీల్లో “ఈనాడు” నాటకానికి ప్రథమ బహుమతి లభించగా, అందులో నసీం పాత్ర పోషించిన బాలసరస్వతి వెండి కప్పును అందుకున్నారు. నాటకాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న బాలసరస్వతికి సినిమాల్లో అవకాశం రావడానికి సురభి కమలాబాయి కారణం. “ద్రోహి” చిత్రంలో నర్సు పాత్రతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత తల్లి అంగీకరించకపోయినా, తండ్రి ప్రోత్సాహంతో ఎన్టీఆర్ తొలి చిత్రం “మనదేశం”లో నటించారు. ఈ చిత్రంలో రేలంగి, బాలసరస్వతిలపై చిత్రీకరించిన “పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి” పాట ఎంతగానో ప్రజాదరణ పొందింది.
“సంసారం”, “శాంతినివాసం” వంటి చిత్రాలలో రేలంగితో ఆమె జంట ప్రేక్షకుల మన్ననలు పొందింది. 1951లో వచ్చిన “రూపవతి”లో టైటిల్ రోల్ పోషించారు. “అర్ధాంగి”లో వేశ్యగా, “అనార్కలి”లో గుల్నార్‌గా, “తెనాలి రామకృష్ణ”లో రాజనర్తకిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. హాస్య పాత్రల్లోనూ రాణించిన బాలసరస్వతి, తన సహనటులను డామినేట్ చేసే స్థాయిలో నటించేవారు. 150కి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను దాదాపు ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసింది. బాలసరస్వతిది ముక్కుసూటి మనస్తత్వం. శకునాలు, జాతకాలను ఆమె నమ్మేవారు కాదు. జీవితంలో ఒంటరి పోరాటం చేశారు. పరిశ్రమలో తోడు అవసరమని భావించి, దర్శకుడు తాపీ చాణక్యతో కొంతకాలం సహజీవనం చేశారు. ఆయనకు అప్పటికే వివాహమైంది. పిల్లలు లేరు. చాణక్య హఠాన్మరణంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. నలుగురితో స్నేహంగా మెలిగే ఆమె, మహానటి సావిత్రికి మంచి స్నేహితురాలు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది బాలసరస్వతినే అనే ప్రచారమూ ఉంది. వృత్తిపరంగా పోటీ పెరిగి అవకాశాలు తగ్గడం, మద్యానికి బానిస కావడం ఆమె చివరి రోజులను దుర్భరంగా మార్చాయి. మద్రాసు వదిలి గూడూరు చేరుకున్న బాలసరస్వతి, 1983 సెప్టెంబర్ 10న దీనమైన పరిస్థితుల్లో కన్నుమూశారు. రంగస్థలంపై పుట్టి, వెండితెరపై రెండు దశాబ్దాల పాటు వెలుగొందిన ఈ అరుదైన నటి జీవితం విషాదాంతంగా ముగిసింది.