
ఫిలిం ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అసోసియేషన్‌లో చిచ్చు పెట్టి, విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే, నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఫెడరేషన్‌పై మరోసారి తిరుగుబాటు జెండా ఎగురవేసిన సుమలత, అనేక అంశాలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఫెడరేషన్ తమ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేయడంపై సుమలత తీవ్రంగా మండిపడ్డారు. “ఏ రూల్ ప్రకారం మా అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నారు? సహాయ నిరాకరణ చేస్తున్నట్టు నోటీసులు ఎందుకు పంపలేదు?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ చర్యలు నిబంధనలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం జరిగిన అడ్ హాక్ కమిటీ మీటింగ్ చెల్లదని సుమలత స్పష్టం చేశారు. ఆ కమిటీలో ఉన్నవారంతా అవినీతికి పాల్పడి గతంలో సస్పెండ్ అయినవారేనని ఆమె ఆరోపించారు. “మాదే అసలైన డ్యాన్సర్స్ అసోసియేషన్. అసలైన కమిటీని పక్కనపెట్టి, తప్పు చేసిన వారికి ఫెడరేషన్ మద్దతిస్తోందా?” అని సుమలత నిలదీశారు. అడ్ హాక్ కమిటీకి ఎటువంటి వాల్యూ ఉండదని, లీగల్‌గా వారికి ఎటువంటి అథారిటీస్ ఉండవని ఆమె తేల్చి చెప్పారు. ఈ వివాదం కేవలం డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు మాత్రమే పరిమితం కాదని, మిగతా 23 అసోసియేషన్లకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చని సుమలత హెచ్చరించారు.
“మేము కూడా నాలుగు యూనియన్లు పెట్టుకొని ఫెడరేషన్‌కు సహాయ నిరాకరణ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు” అని ఆమె తమ బలాన్ని ప్రదర్శించారు. తమ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియను కూడా సుమలత సమర్థించుకున్నారు. తమ ఎన్నికలలో 500 మంది ఉన్న యూనియన్‌లో 114 మంది ఓటు వేశారని, దానిని కొందరు చెల్లదని అన్నారని, అయితే లీగల్‌గా వారికి ఆపే అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. 50 మంది వేసినా ఎన్నికలు ఎన్నికలే అని ఆమె పేర్కొన్నారు. ఆదివారం నాటి అనధికారిక మీటింగ్‌కు ఎంత మంది వచ్చారో తెలియదని, తమ మీటింగ్‌లకు అంత మందిని తీసుకురాగలమని ఆమె ఛాలెంజ్ చేశారు. వ్యవస్థ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద వెళ్తుందని, గూడు పుఠానీ చేసి లోపల లోపల మాట్లాడుకునే వాటి మీద వెళ్లదని ఆమె స్పష్టం చేశారు. “యూనియన్ సభ్యులు అయినా బయట సభ్యులు అయినా మా యూనియన్‌ను రెండు ముక్కలుగా విడదీయాలి అని అనుకుంటే మాత్రం నడిరోడ్డు మీద నిలచోబెట్టి మరీ కొడతాం. ఇది మాత్రం సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నాను” అని సుమలత గట్టిగా చెప్పారు. ఇది 35 ఏళ్ల యూనియన్ చరిత్ర అని, ముక్రాజ్ మాస్టర్ ఎంతో కష్టపడి ఈ యూనియన్‌ను స్థాపించారని ఆమె గుర్తు చేశారు. ఎవడో ఫ్రాడ్ చేసినవాడు వచ్చి అడ్ హాక్ కమిటీ పెడతాం అంటే అంత ఈజీగా అయ్యేది కాదని ఆమె హెచ్చరించారు. యూనియన్‌ను విడదీయాలని చూసేవారు ఒళ్లు జాగ్రత్త పెట్టుకొని పనులు చేయాలని, దీనిపై తాము ఎంత దూరమైనా వెళ్తామని సుమలత స్పష్టం చేశారు.