మాజీ ఎంపీ, నటి సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది. ఆ తర్వాత సహాయ పాత్రలలోనూ కనిపించింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తాజాగా మలయాళం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న జస్టిస్ హేమ కమిటీ నివేదికపై స్పందించింది. అలాగే మలయాళీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఇప్పటికీ బయటకు రాని ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
“మలయాళ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. కానీ ఇతర నటీమణులు తమకు ఎదురైన పరిస్థితుల గురించి నాతో చెప్పారు. కొంతమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని, అక్కడి పరిస్థితులను నాతో పంచుకునేవారు. సినిమా ఇండస్ట్రీలో ‘పవర్ గ్రూపుల’ గ్రూపులు ఎప్పుడూ ఉంటాయి. సినీ పరిశ్రమలో మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నేను పనిచేసిన సినిమా సెట్స్ లో ఎప్పుడూ కుటుంబ వాతావరణం ఉండేది. కానీ ఇండస్ట్రీలో చాలాసార్లు భయానక పరిస్థితులు ఎదుర్కొన్నామని కొందరు నటీమణుల నుంచి విన్నాను.
లైంగిక వేధింపుల గురించి కొందరు నటీమణులు నాకు వ్యక్తిగతంగా చెప్పారు. సినిమా రంగానికి చెందిన కొందరు వ్యక్తులు తమకు అవకాశం ఇవ్వడమే కాకుండా వేరే కారణాలతో తమకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఒక్కసారి నటీమణులు వారు చెప్పిన మాట వినకుండా నిరాకరిస్తే వారికి మళ్లీ అవకాశం రాదని.. అలాగే వారి కెరీర్ కూడా అంతం చేస్తారని చెప్పారు. ఈ విషయాలు బయటపెడితే నటీమణులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాబట్టి ఎవరూ ఇలాంటి విషయాలు మాట్లాడేవారు కాదు” అంటూ చెప్పుకొచ్చింది సుమలత. కాలం మారింది.. మార్పు వచ్చింది.. కానీ ఇప్పటికీ నటీమణులకు అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నటీమణులు బస చేసే హోటల్ గదుల తలుపులు కొట్టిన భయంకర పరిస్థితులు కూడా విన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.