
కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి ఐదేళ్లయింది. అయితే ఆయన అకాల మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగిన పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న కన్నుమూశారు. అప్పటికింకా ఆయనకు కేవలం 46 ఏళ్లు మాత్రమే. కాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా పునీత్ కు గుండెపోటు వచ్చిందని, అదే ఆయనను బలి తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే పునీత్ మరణానికి ముందు అసలు ఏం జరిగిందో ఆ ఇంటి ఫ్యామిలీ డాక్టర్ రమణ రావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ రావు అప్పుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పు తనకు కొడుకులాంటివాడని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆ రోజు అప్పు జిమ్‌లో మామూలుగా కాకుండా కిక్‌బాక్సింగ్ చేశాడు. ఆయన సుమారు గంటన్నర పాటు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత, బాగా అలసిపోయి నా క్లినిక్‌కు వచ్చాడు. అప్పు క్లినిక్‌కు వచ్చినప్పుడు, ఆయన శరీరం మొత్తం చెమటతో నిండి ఉంది. అప్పు పరిస్థితి చూసి వైద్యులకు అనుమానం వచ్చింది. వారు వెంటనే ఈసీజీ తీశారు. ఈసీజీలో ఆయన గుండెపై ఉన్న ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. అది సాధారణ గుండెపోటు కాదు. గుండె తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నట్లు తేలింది. దీంతో డాక్టర్లు వెంటనే అప్పును నిద్రలేపి ప్రథమ చికిత్స చేశారు. అవసరమైన మందులు ఇచ్చారు. ఆ వెంటనే మెరుగైనా వైద్యం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశాం’.
‘అప్పు తన సొంత కారులోనే ఆసుపత్రికి వెళ్లారు. దారిలో ఆయన తన భార్య అశ్విని ఒడిలో తలపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. డ్రైవర్‌ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాను. అదే సమయంలో డాక్టర్ రంగ నాయక్ అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆస్పత్రి చేరుకునేలోపే అప్పు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. చెప్పాలంటే ఆస్పత్రిలోకి ప్రవేశించే లోపు కథ అయిపోయింది. అక్కడికి ఆస్పత్రి ప్రోటోకాల్‌ని అనుసరించి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం, కానీ ఫలితం మాత్రం శూన్యం’ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు డాక్టర్ రమణరావు. ఆ క్షణం తనకు తన సొంత కొడుకునే కోల్పోయినంత బాధ వచ్చిందన్నారు డాక్టర్. ప్రస్తుతం రమణ రావు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పునీత్ అభిమానులు తమ హీరోను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.