ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.! డిలీట్ చేయాల్సిందే అంటూ

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ , విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు.

ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.! డిలీట్ చేయాల్సిందే అంటూ
Fauzi

Updated on: Oct 28, 2026 | 1:10 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ  చుట్టూ వివాదం నెలకొంది. ఈ సినిమా టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చూపించిన తీరుపై ఆయన మనవడు చంద్ర కుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే చిత్ర బృందం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాయడం వైరల్ గా మారింది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫౌజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, పలు కారణాలతో ఆ తేదీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ స్పై పాత్రలో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, అదే టీజర్ ఇప్పుడు వివాదానికి కారణమైంది.

టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను చూపించిన విధానంపై ఆయన మనవడు చంద్ర కుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక వ్యక్తులకు సంబంధించిన అంశాలను కల్పిత కథతో ముడిపెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేతాజీ స్థాయిని తగ్గించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, చిత్ర బృందం భారత ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై చిత్ర బృందం నుంచి స్పందన రాకపోవడంతో చంద్ర కుమార్ బోస్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చరిత్ర వక్రీకరణకు అవకాశం లేకుండా కొత్త టీజర్‌ను విడుదల చేయాలని సూచించారు. నేతాజీ పాత్రకు సంబంధించి తమ అభ్యంతరాలను పరిష్కరిస్తే ప్రభాస్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో దర్శకుడు హను రాఘవపూడి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

చంద్ర కుమార్ బోస్ తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్టోబర్ 23న విడుదలైన ఫౌజీ టీజర్‌లో నేతాజీని హిట్లర్‌తో మాట్లాడుతున్నట్లుగా చూపించి, కల్పిత పాత్రను పరిచయం చేసిన విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతాజీ భారత జాతీయ సైన్యానికి సుప్రీం కమాండర్‌గా, దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక నాయకుడిగా చరిత్రలో నిలిచారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అలాంటి చారిత్రక వ్యక్తిని చూపించే విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫౌజీ టీజర్‌కు సెన్సార్ అనుమతి ఎలా లభించిందనే అంశంపై కూడా చంద్ర కుమార్ బోస్ ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాస్పద కంటెంట్‌పై విచారణ జరిపించాలని, టీజర్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, ఈ టీజర్‌కు అనుమతి ఇచ్చే ప్రక్రియలో బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. మరి దీని పై అటు సెంట్రల్, ఇటు చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us