
జన నాయగన్ అనేది తలపతి విజయ్ నటించిన 69వ చిత్రం . ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగులో విడుదలైన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి రీమేక్. ఇందులో తలపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, నరైన్ , ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత, సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయకన్’ సినిమాను అక్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేసిన మరికొందరిని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు క్లౌడ్ స్టోరేజ్, సోషల్ మీడియా లింకుల ద్వారా సినిమాను వైరల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమా నిర్మాత KVN ప్రొడక్షన్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న సుమారు 300 కంటే ఎక్కువ పైరసీ లింకులను బ్లాక్ చేయించారు. టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఇతర వెబ్‌సైట్లలో ఈ సినిమా క్లిప్పింగ్‌లు షేర్ కాకుండా ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి.
విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డుతో వివాదాల కారణంగా విడుదల ఆలస్యమవుతున్న తరుణంలో, సినిమా లీక్ కావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైరసీని ప్రోత్సహించవద్దని, లీకైన లింకులను ఎవరూ షేర్ చేయకూడదని చిత్ర బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. చట్టవిరుద్ధంగా సినిమాను చూసే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..