
ప్రేమ కోసం చాలామంది టాటూలు వేయించుకుంటారు. ప్రేమించిన వ్యక్తి పేరును గుండెలపై శాశ్వతంగా చెక్కించుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం తన గుండెపై తన నాన్న టాటూనే వేయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతని ప్రేమను దూరం చేసినా… “నాన్న కన్నా అమ్మాయి ముఖ్యం కాదు” అంటూ అతను రాసిన ఒక్క కామెంట్ ఇప్పుడు వేలాది మంది మనసులను కదిలిస్తోంది.
ఆ యువకుడు రాసిన మాటలు.. “నా హార్ట్‌పై మా నాన్న టాటూ ఉంది. టాటూ వేయించుకునే ముందు నా గర్ల్‌ఫ్రెండ్ ‘టాటూ వేయించుకోకు.. మన రొమాన్స్‌కు మధ్యలో మీ నాన్న ఉంటారు’ అంది. కానీ నా గుండె మా నాన్నది. ఎవరి మాట వినకుండా టాటూ వేయించుకున్నాను. చివరకు నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసింది. అయినా నాన్న కన్నా అమ్మాయి ఇంపార్టెంట్ కాదు కదా?”. ఈ ఒక్క కామెంట్‌లో ఓ కొడుకు తన తండ్రిపై ఉన్న ప్రేమను ఎంత గొప్పగా వ్యక్తం చేశాడో తెలుస్తోంది.
చాలామంది ప్రేమ కోసం టాటూలు వేయించుకుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తన తండ్రి రూపాన్ని గుండెపై శాశ్వతంగా నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం కారణంగా ప్రేమించిన అమ్మాయిని కోల్పోయినా.. తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. ప్రేయసి జీవితంలోకి రావచ్చు.. వెళ్లిపోవచ్చు. కానీ తండ్రి మాత్రం పుట్టిన క్షణం నుంచి ప్రతి అడుగులో నీడలా ఉంటాడు. పిల్లల కోసం తన కోరికలను వదులుకుని, వారి భవిష్యత్తు కోసం కష్టపడే వ్యక్తి తండ్రి. అలాంటి బంధాన్ని ఏ ప్రేమతోనూ పోల్చలేమనే సందేశాన్ని ఈ కామెంట్ గుర్తు చేస్తోంది.
ఈ కామెంట్‌ను చదివిన చాలామంది నెటిజన్లు “ఇదే నిజమైన తండ్రి ప్రేమకు ఇచ్చిన గౌరవం”, “గుండెల్లో నాన్న ఉంటే ఇంకెవరూ ఆ స్థానాన్ని తీసుకోలేరు”, “ఇలాంటి కొడుకులు ఉండటం తండ్రుల అదృష్టం” అంటూ స్పందిస్తున్నారు. ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం బాధే. కానీ తనను జీవితాంతం ప్రేమించే తండ్రిని గౌరవించడం అంతకంటే గొప్ప విషయం. గుండెపై ఉన్న టాటూ కేవలం ఒక బొమ్మ కాదు.. తన తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమకు గుర్తు. అందుకే ఆ యువకుడు చివర్లో అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.. “అయినా… నాన్న కన్నా అమ్మాయి ఇంపార్టెంట్ కాదు కదా?”