
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత ఆర్పీ పట్నాయక్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, టాలీవుడ్ పరిశ్రమలో తన అనుభవాలు, కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు. చిత్రం సినిమా సక్సెస్ తర్వాత తన జీవితంలో ఏం మారిందనే ప్రశ్నకు, నో చెప్పడం పెరిగిందని పట్నాయక్ బదులిచ్చారు. సుమారు 22 చిత్రాలను తిరస్కరించానని, ఇది చాలామందికి ప్రతికూలంగా అనిపించినా, తన కెరీర్ విజయ నిష్పత్తిని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. చిత్రం విజయం కేవలం బడ్జెట్ వల్ల కాదని, అద్భుతమైన కాన్సెప్ట్, అనుభవజ్ఞుడైన దర్శకుడు తేజ వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. తేజగారిని అనుకరించడానికి ప్రయత్నించి చాలామంది నష్టపోయారని, తాను మాత్రం సెలెక్షన్ పట్ల జాగ్రత్తగా ఉన్నానని చెప్పారు. తన నిర్ణయాల వల్ల చాలామందికి శత్రువులయ్యానని, ఈ మనిషికి గర్వం ఎక్కువని కూడా అన్నారని పట్నాయక్ గుర్తుచేసుకున్నారు. అయితే, తనతో ప్రయాణించిన వారికి తాను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో తెలుసని ఆయన పేర్కొన్నారు. నో చెప్పడానికి ధైర్యం కావాలని, ఈ ధైర్యం కారణంగా కొంతమందికి తాను బ్యాడ్ అయ్యానని, కానీ తన ఉద్దేశ్యం కేవలం తన కెరీరేనని వివరించారు.
“నువ్వు నేను” సినిమాలోని పాటలు ఎంత వైరల్ అయ్యాయో గుర్తుచేసుకుంటూ, సోషల్ మీడియా అప్పట్లో ఉండి ఉంటే ఆర్పీ పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేదని అన్నారు. తేజగారితో తన పని అనుభవం గురించి మాట్లాడుతూ, ఆయన ఒక సిట్యుయేషన్ చెబితే, తాను వెంటనే ట్యూన్ చెప్పేస్తానని, రికార్డింగ్‌కి వెళ్తామని అన్నారు. తేజకి ఏమి కావాలో ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంటుందని పట్నాయక్ తెలిపారు. “ఎవరెన్న ఏమన్నా మారదు ఈ ప్రేమ” పాట గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ పాటను మొదట “నువ్వు నేను” కోసం కులశేఖర్ లిరిక్ రాసి, ట్యూన్ చేయమని తనకు ఇచ్చారని, కానీ చివరికి “జయం” సినిమాలో దాన్ని వాడారని చెప్పారు. కాలేజీ పాటలలో జానపద టచ్‌ను తీసుకురావడానికి గల కారణాన్ని వివరించారు. తన 17 సంవత్సరాల చదువులో తాను ఎప్పుడూ వెస్ట్రన్ పాటలు పాడుతూ, బైకులపై తిరుగుతూ చూడలేదని, కేవలం తరగతి గదుల్లో కూర్చొని ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఆనందించామని, ఈ వాస్తవిక దృక్పథాన్ని తేజ కూడా అంగీకరించారని అన్నారు.
“గాజువాక పిల్ల” పాట తనకు ఎంతో గౌరవం, ధైర్యాన్ని ఇచ్చిందని, అయితే ఆ పాటకు సంబంధించి సానుకూల, ప్రతికూల సంఘటనలు రెండూ ఉన్నాయని తెలిపారు. ఒక పెళ్లి వేడుకలో ఈ పాటను విపరీతంగా డాన్స్ చేసి ఒక వ్యక్తి చనిపోయిన విషాద సంఘటనను పట్నాయక్ గుర్తుచేసుకున్నారు. ఒక పాట ఎంత సానుకూల ప్రభావాన్ని ఇస్తుందో, అతిగా చేస్తే అంతే నెగిటివిటీని కూడా ఇస్తుందని దీని ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు. “9 నెలలు” సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసిన అనుభవాన్ని వివరిస్తూ, దర్శకుడు క్రాంతి కుమార్ చివరి దశలో ఉన్నప్పటికీ, ఆయన కోరిక మేరకు తాను ఆ సినిమాకు పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో విక్రమ్ భవిష్యత్తు గురించి ఒక ఆసక్తికరమైన అంచనా వేశానని, విక్రమ్ తప్పకుండా ఒక పెద్ద స్టార్ అవుతాడని తన బృందానికి చెప్పానని అన్నారు. సౌందర్య నటన ఒక కోణంలో ఉండగా, విక్రమ్ నటనలో స్ట్రగుల్, నెగిటివ్ షేడ్స్ రెండూ ఉన్నాయని, ఆ నటన చాలా కష్టమైందని, అది చేయగలిగిన విక్రమ్ ఇండస్ట్రీని ఏలుతాడని అప్పుడే తనకు అర్థమైందని పట్నాయక్ వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి