Sr NTR: ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య ఇలా ఉండేది..

లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు దినచర్య క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనం. మద్రాసులోని ఆయన లక్ష్మీ నిలయం ఇంట్లో ఉదయం 3 గంటలకు మొదలై, మసాజ్, పూజలు, స్క్రిప్ట్ చర్చలు, అభిమానులతో సమావేశం, షూటింగ్, రాత్రి 9 గంటలకు నిద్రతో కూడిన ఈ పద్ధతిని దాదాపు 30 ఏళ్లు నిరంతరం పాటించారు.

Sr NTR: ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య ఇలా ఉండేది..
N.T. Rama Rao

Updated on: May 28, 2026 | 11:35 AM

నేడు దివంగత లెజెండ్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి. ఈ సందర్భంగా అప్పట్లో ఆయన దినచర్య ఎలా ఉండేదో తెలుసుకుందాం. మద్రాసు మహానగరం, త్యాగరాయనగర్‌లోని బజుల్ల రోడ్డులో ఉన్న ఆయన నివాసం లక్ష్మీ నిలయం, ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలోనే సందడిగా మారేది. ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి, ఆరుబయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చేవారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కొంతసేపు వ్యాయామం చేయడం ఆయన దినచర్యలో భాగం. సరిగ్గా మూడున్నరకు వాహిని స్టూడియో నుంచి మసాజ్ చేసే వ్యక్తి వచ్చేవారు. విజయ అధినేత నాగిరెడ్డికి అత్యంత ఆంతరంగికుడైన ఆ వ్యక్తి, ఎన్టీఆర్ కోరిక మేరకు ఆయనకు, ఆయన సోదరుడు త్రివిక్రమరావుకు మసాజ్ చేసేవారు. మసాజ్ సమయంలో ఎన్టీఆర్ గోచి కట్టుకొని సిద్ధంగా ఉండేవారు. అరగంట పాటు శరీరానికి ఆయిల్ పట్టించి మసాజ్ జరిగేది. అనంతరం ఎన్టీఆర్ స్నానం చేసి, పూజ ముగించుకుని, తెల్లని పంచె, లాల్చీ ధరించి తన ఆఫీస్ రూమ్‌లో కూర్చునేవారు. అక్కడ తన బ్యానర్‌పై తీయబోయే చిత్రాల స్క్రిప్ట్‌లు చూడటం, రచయితలకు మార్పులు సూచించడం, కథా చర్చలు జరిపేవారు. సరిగ్గా 5 గంటలకు ఐదు నిమిషాల్లో భోజనం పూర్తి చేసుకుని మేకప్‌కు కూర్చునేవారు.

మేకప్ చేసుకునే ముందు భగవద్ధ్యానం చేయడం ఆయన అలవాటు. సామాజిక చిత్రాలైతే మేకప్ త్వరగా పూర్తయ్యేది, పౌరాణిక చిత్రాలకు ఎక్కువ సమయం పట్టేది. ఐదున్నరకి దుస్తులు ధరించి హాల్‌లోకి వచ్చేవారు. అప్పటి నుంచి నిర్మాతలు ఆయనను కలవడానికి వచ్చేవారు. ఉదయం 6:30 గంటలకు బజుల్లా రోడ్డు పర్యాటక బస్సులతో సందడిగా మారేది. తిరుపతి నుంచి ఎన్టీఆర్ దర్శనం కోసం వచ్చే టూరిస్టులను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఆయన కలిసేవారు. కనీసం ఐదు బస్సులు వస్తే తప్ప ఆయన బయటికి వచ్చేవారు కాదు. వారితో ఐదు నిమిషాలు మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. సినిమాలు గురించి చాలా అరుదుగా మాట్లాడేవారు. అభిమానులు ఆయనను దేవుడిలా భావించి నమస్కరించేవారు. బయటకు వెళ్లే ముందు కారు డ్రైవర్ కారు సిద్ధం చేయగా, ‘భూతాల రాజు’ గుమ్మడికాయ మీద హారతి వెలిగించి దిష్టి తీసేవారు. షూటింగ్ స్పాట్‌కు వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ కాసేపు కునుకు తీసేవారు. హీరోలకు సొంత కుర్చీలు, వ్యక్తిగత సహాయకులు అనే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఎన్టీఆర్. ఆయన కుర్చీ సెట్‌లోకి వచ్చిందంటే, ఎన్టీఆర్ వస్తున్నారని సంకేతం. సెట్‌లో ఉన్నవారంతా అలర్ట్ అయ్యి నిలబడేవారు. రామారావు రాగానే నిర్మాతకు, దర్శకుడికి నమస్కరించి పనిలో నిమగ్నమయ్యేవారు. సరిగ్గా 8 గంటలకు తొలి షాట్ తీసేవారు. 12:55 గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చి, స్టూడియోలో షూటింగ్ ఉంటే ఇంటికి వెళ్లి అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ 1:50 గంటలకు బయలుదేరేవారు. 2 గంటలకు తిరిగి షూటింగ్ స్పాట్‌లో ఉండేవారు. ఎన్టీఆర్ క్రమశిక్షణను చూసి కొందరు తమ వాచీల్లో సమయం సరిచేసుకునేవారు. దర్శకుడు చిన్నవాడైనా, పెద్దవాడైనా సమానంగా గౌరవించేవారు. తన పనిలో వేలు పెట్టకుండా, సలహా ఇవ్వాలనుకుంటే దర్శకుడిని పక్కకు తీసుకెళ్లి చెప్పేవారు. సెట్‌లో గంభీరంగా ఉండేవారు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవారు కాదు.

చాలా సందర్భాలలో సాయంత్రం షూటింగ్ స్పాట్‌లో టిఫిన్ తినేవారు. పకోడీలు, మిరపకాయ బజ్జీలు, తాపేశ్వరం కాజాలు, మినప సున్నుండలు, జున్ను వంటివి ఆయనకు అమిత ఇష్టం. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మాతలు కలవడానికి వస్తే మాట్లాడేవారు. 8 గంటలకల్లా భోజనం చేసి, 9 గంటలకు పడుకునేవారు. ఈ దినచర్యను దాదాపు 30 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పాటించి ఎన్టీఆర్ ఎంతోమందికి ఆదర్శనీయుడయ్యారు.

నాకు మొదట పెట్టిన పేరు వేరే.. NTR అని మార్చింది తాతగారే.. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us