ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 16) ఉదయం సింపుల్ గా పెళ్లి పీటలెక్కిన ఈ ప్రేమ పక్షులు ఆ తర్వాత తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అదితి, సిద్ధార్థ్‌ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కొద్ది మంది అతిధుల సమక్షంలో తెలంగాణలోని 400 ఏళ్ల నాటి పురాత ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా అదితికి, సిద్ధార్థ్‌కి ఇది రెండో వివాహం. దీనికి ముందు, సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనా నారాయణ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక అదితి గతంలో నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. 1972లో జన్మించిన సత్యదీప్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్శిటీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ కూడా పొందాడు. న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడే సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత కూడా సాధించాడు. ఆ తర్వాత పది నెలల శిక్షణ పొందాడు. కానీ తనకు కేటాయించిన ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగానికి మాత్రం చేరలేదు. అంతకు ముందు ఢిల్లీలో కార్పోరేట్ లాయర్‌గా పనిచేశారు సత్యదీప్.
కాగా సినిమాలపై మక్కువతో 2010లో ముంబై వచ్చాడు సత్యదీప్. 2011లో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాతో తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత ‘బాంబే వెల్వెట్’, ‘విక్రమ్ వేద’, తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో 2007లో అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నాడు. అప్పుడు అతని వయస్సు 35 సంవత్సరాలు. అదితి వయస్సు 21 సంవత్సరాలు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2013లో అదితి, సత్యదీప్ విడిపోయారు. ‘మేము విడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ మా సంబంధం పేరు మాత్రమే మారిపోయింది. మేం ఇప్పటికీ మంచి స్నేహితులం’ అని అంటాడు సత్యదీప్.
సత్యదీప్ ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు. మసాబా మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ల కుమార్తె.
.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.