అలాంటి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది.. వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్

హీరోయిన్ కీర్తి సురేష్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మలయాళీ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనే అత్యధిక చిత్రాల్లో నటించింది. తెలుగులో నేను శైలజ సినిమాతో అడుగుపెట్టిన ఆమె.. మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత తనకు ఆరు నెలలు ఏ అవకాశం రాలేదని తెలిపింది కీర్తి.

అలాంటి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది.. వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్
Keerthy Suresh

Updated on: Nov 22, 2026 | 10:12 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సంబంధించిన వార్తలు, ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్స్‌ రెగ్యులర్ గా చర్చనీయాంశంగా మారుతుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి ప్రచారాలు నటీనటులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ కూడా తన జీవితంలో ఎదురైన ఇలాంటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనపై గతంలో వచ్చిన ప్రేమ వ్యవహారాల ప్రచారాలు ఎంతగానో బాధించాయని అన్నారు. తనకు ఇండస్ట్రీలోని పలువురు నటులతో సంబంధాలు ఉన్నాయంటూ గతంలో వార్తలు రావడం బాధ కలిగించిందని కీర్తి తెలిపారు. తన జీవితంలో ఇప్పటివరకు ఒక్కరినే ప్రేమించానని, అతనే తన భర్త ఆంటోనీ తటిల్‌ అని స్పష్టం చేశారు. నిజం తెలిసినప్పుడు ఇలాంటి ప్రచారాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించినట్లు వెల్లడించారు. తనపై వస్తున్న రూమర్స్‌ గురించి ఆంటోనీ కూడా అప్పుడప్పుడు అడిగేవారని కీర్తి చెప్పారు. వాటిపై స్పందించాలా? అని తనను ప్రశ్నించేవారని తెలిపారు. అయితే, ఆంటోనీ ఎప్పుడూ తనను అనుమానించలేదని, తమ మధ్య నమ్మకం ఎంతో బలంగా ఉందని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేనప్పుడు బయటివారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కీర్తి అన్నారు.

తన భర్త ఆంటోనీ చాలా మంచి వ్యక్తి అని కీర్తి ప్రశంసించారు. కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఆయన తనకు అండగా నిలుస్తారని చెప్పారు. నిరాశకు గురైన సందర్భాల్లో ధైర్యం చెబుతూ మళ్లీ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారని వెల్లడించారు. తన విజయాల వెనుక ఆంటోనీ మద్దతు ఎంతో ఉందని చెప్పకనే చెప్పారు. ఆంటోనీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హడావుడి, మీడియా ఇంటర్వ్యూలు, ప్రచార కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి ఉండదని కీర్తి తెలిపారు. అందుకే తన సినిమా కార్యక్రమాల పేరుతో ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోనని చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని, భర్త ప్రైవసీని గౌరవించడం తనకు ముఖ్యమని ఆమె మాటల్లో అర్థమవుతోంది.

కీర్తి సురేశ్‌, ఆంటోనీ తటిల్‌ ప్రేమకథ కూడా ప్రత్యేకమే. దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన ఈ ఇద్దరూ ప్రస్తుతం అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తన చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీర్తి సురేశ్‌.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై వచ్చిన రూమర్స్‌, భర్తతో ఉన్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి సాగిన తమ ప్రేమలో నమ్మకమే ప్రధానమని కీర్తి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us