మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు..

సినిమా పట్ల అయిష్టత చూపిన జయసుధ, చిన్నతనంలో ఓ జ్యోతిష్యుడి అంచనాతో పాటు తన బంధువు విజయనిర్మల ప్రోత్సాహంతో అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె అసలు పేరు సుజాత కాగా, ఒకప్పటి సుజాత అనే నటి కారణంగా జయసుధగా మారింది. ఈ అద్భుత ప్రస్థానం వెనుక ఆమె తల్లిదండ్రుల సినీ నేపథ్యం కూడా ఒక కారణం.

మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు..
Jayasudha

Updated on: Jul 12, 2026 | 11:22 AM

తెలుగు చిత్రసీమలో సహజనటిగా పేరుగాంచిన జయసుధ సినీ ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన, అరుదైన విషయాలు దాగి ఉన్నాయి. చిన్నతనం నుంచే సినిమాల పట్ల అయిష్టతను ప్రదర్శించిన ఆమె, ఒక జ్యోతిష్యుడి జోస్యం, కుటుంబ నేపథ్యం, అనుకోని పరిణామాల వల్ల చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, అగ్రతారగా ఎదగడం విశేషం. జయసుధ తల్లిదండ్రులు రమేష్, జోగాబాయి. జోగాబాయి తండ్రి నిడదవోలు వెంకట్రావు గొప్ప పండితులు. జోగాబాయికి లలిత కళలంటే చిన్నతనం నుంచే ఆసక్తి ఎక్కువ. బడిలో చదువుకుంటూనే ఆల్ ఇండియా రేడియో బాలల కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాష్ రావు నిర్మించిన బాలానందం చిత్రంలోని కొంటె కృష్ణయ్యలో జోగాబాయి నటించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెద్దమనుషులు చిత్రంలో ఒక పాట కూడా పాడారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తండ్రి ప్రకాష్ రావు దర్శకత్వంలో జోగాబాయి నటించగా, కొడుకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో జయసుధ నటించి చక్కని పేరు తెచ్చుకున్నారు. జయసుధ తండ్రి రమేష్ ఆ రోజుల్లో మద్రాస్ కార్పొరేషన్‌లో పనిచేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్‌లు నిర్వహించేవారు. ఆయన ఆంధ్ర విజ్ఞాన సభ పేరుతో నాటక సంస్థను నడిపేవారు. రమేష్, జోగాబాయిల పరిచయం ప్రేమగా మారి, ఫిబ్రవరి 2, 1956న వారి వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే వీరికి ఓ కొడుకు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత డిసెంబర్ 12, 1958న సుజాత (జయసుధ అసలు పేరు) జన్మించారు. ఆమె తర్వాత సుభాషిని, మనోహర్, వెంకటేష్ అనే సోదరులు పుట్టారు. కొడుకు పోవడంతో జయసుధను తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచారు. జయసుధను ఐదో ఏట ట్రిప్లికేన్‌లో ఓ కాన్వెంట్‌లో చేర్పించారు. మొదట్లో స్కూల్‌కి వెళ్ళనని మారాం చేసినా, తర్వాత చదువుపై శ్రద్ధ పెరిగింది. జోగాబాయికి సినిమాలంటే పిచ్చి. తరచూ సినిమాలు చూడాల్సిందే. అయితే సుజాతకు సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు. నేను రాను మమ్మీ, మూడు గంటల సేపు తలుపులు బిగించి ఆ థియేటర్‌లో ఎవరు కూర్చుంటారు అని మారాం చేసేది. అయినప్పటికీ, జోగాబాయి బతిమాలి సుజాతను సినిమాకు తీసుకెళ్లేవారు. 1968లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రమేష్ తన స్నేహితులతో బెంగళూరు వెళ్లారు. అక్కడ జయనగర్‌లో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఒకాయన అద్భుతంగా జోస్యం చెప్పేవారు. జాతకాల మీద నమ్మకం లేకపోయినా, స్నేహితుల బలవంతం మీద రమేష్ ఆయన దగ్గరకు వెళ్లారు. మిత్రుల ఒత్తిడితో తన పిల్లల భవిష్యత్తు గురించి అడిగారు. ఆ జ్యోతిష్యుడు రమేష్ వివరాలు అడిగి, లెక్కలు వేసి, మీ పెద్దమ్మాయి సినిమా నటిగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది, గొప్ప పేరు, డబ్బు సంపాదిస్తుంది అని చెప్పారు. సినిమాల పేర్లు ఎత్తితేనే మండిపడే సుజాత హీరోయిన్ కావడం ఏంటని ఆ జోస్యాన్ని రమేష్ తేలిగ్గా తీసుకున్నారు. నాలుగు రోజుల తర్వాత రమేష్ మద్రాస్ తిరిగి వచ్చారు. ఇంట్లో సుజాత కనబడకపోవడంతో భార్యను అడిగారు. రమేష్ పినతండ్రి కూతురు విజయనిర్మల, సుజాతను పండంటి కాపురం చిత్రంలో ఒక చిన్న వేషం కోసం తీసుకెళ్లిందని జోగాబాయి చెప్పారు. ఆ సినిమా విడుదల కాగానే సుజాతకు మరో రెండు తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీనితో ఆశ్చర్యపోయిన రమేష్, జోగాబాయిని వెంటబెట్టుకొని బెంగళూరు వెళ్లి ఆ జ్యోతిష్యుడిని కలిశారు. విషయం చెప్పగానే నవ్వేసి, మీరెవరు ఆ అమ్మాయిని ఆపలేరు. ఎన్ని అవరోధాలు కల్పించినా ఆమె నటిగా గమ్యం చేరుకుంటుంది అని చెప్పారు. ఆ మాటల మీద నమ్మకంతో రమేష్ ఇక కాదనలేకపోయారు. పరిశ్రమలో అప్పటికే సుజాత అనే నటి ఉండటంతో, నటుడు ప్రభాకర్ రెడ్డితో చర్చించి సుజాత పేరును జయసుధగా మార్చారు. అలా అపారమైన ప్రతిభతో, అదృష్టం తోడుగా జయసుధ అగ్రతారగా సినీ చరిత్రలో నిలిచిపోయారు.

తన సినిమాతో చిరంజీవితో పోటీ పడ్డ నారాయణమూర్తి.. ఎవరు నెగ్గారో తెలిస్తే ఆశ్చర్యపోతారు 

 

Follow Us