
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి. ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించిన ఆయన తన కామెడీతోనూ ప్రేక్షకులను నవ్వించారు. గుండెపోటుతో జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయప్రకాశ్ రెడ్డి తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను, సినీ రంగంలోకి తన కమ్ బ్యాక్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, భయంకరమైన అప్పులలో కూరుకుపోవడంతో ఆయన ఐదేళ్లపాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అప్పుల ఊబిలో మరింత చిక్కుకోకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఉద్యోగం చేస్తున్న కాలంలోనూ తొమ్మిది సంవత్సరాలు జీతంలో కోత పడిన సెలవు తీసుకుని, అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషించినట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో అనేకమంది మిత్రులు సహాయం చేశారని, వారందరి రుణాలను తీర్చినట్లు చెప్పారు. పరిశ్రమకు దూరమైన ఐదేళ్ల కాలంలో కూడా దాసరి నారాయణ రావు, సురేష్ ప్రొడక్షన్స్ నుండి మూడు సార్లు ఫోన్‌లు వచ్చాయని, అయితే తాను మళ్లీ ఇబ్బందుల్లో పడతానేమోనని వాటిని పట్టించుకోలేదని జయప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ ఐదేళ్లలో ట్యూషన్లు చెప్పడం, ఇతర పనులు చేయడం ద్వారా తన అప్పులలో 40-45% తీర్చగలిగానని ఆయన చెప్పారు. ఆయన జీవితంలో ఒక అనూహ్య మలుపు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో సంభవించింది. ఒక మిత్రుడితో కలిసి పూర్తి బాడీ చెకప్ కోసం వెళ్ళినప్పుడు, అక్కడ రామానాయుడు గారిని అనుకోకుండా కలుసుకున్నారట.
జయప్రకాష్ రెడ్డిని గుర్తించిన రామానాయుడు గారు, ఎక్కడికి వెళ్లిపోయావు.? బుద్ధి జ్ఞానం ఉందా నీకు.? అంటూ ఆయనను మందలించారట. అనంతరం సురేష్ బాబు నిర్మిస్తున్న ఒక కొత్త చిత్రంలో (ప్రేమించుకుందాం రా) ఒక ముఖ్యమైన పాత్ర ఉందని, సాయంత్రం సురేష్ బాబును కలవమని సూచించారు. ఈ చిత్రం జయప్రకాష్ రెడ్డికి సెకండ్ ఇన్నింగ్స్ గా మారింది. చిత్ర దర్శకుడు జయంత్ పరాంజి, హీరోయిన్ తండ్రి, మెయిన్ విలన్ పాత్రకు జయప్రకాష్ రెడ్డిని ఎంపిక చేశారట. అమ్రీష్ పూరి, నానా పటేకర్ వంటి నటులను కూడా ఈ పాత్ర కోసం పరిశీలించినట్లు జయంత్ తెలిపారట. జయప్రకాష్ రెడ్డి ఈ అవకాశాన్ని పరమేశ్వరుడి దయగా అభివర్ణించారు. శివయ్య అనుగ్రహంతోనే ఈ అవకాశం వచ్చిందని, ఈ ఆఫర్ తన శివ దీక్ష ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పాత్రకు మరింత జీవం పోయడానికి, జయప్రకాష్ రెడ్డి రాయలసీమ మాండలికాన్ని ఉపయోగించాలని సూచించారట. చిన్నతనం నుండి కడప, అనంతపురం జిల్లాల్లో పెరగడం వల్ల తనకు రాయలసీమ భాషపై పట్టు ఉందని వివరించారట.. దీంతో ఆయన అసిస్టెంట్‌తో కలిసి పది రోజుల పాటు కర్నూలు జిల్లాలోని నంద్యాలలో పర్యటించి, స్థానిక భాషా శైలిని, పదజాలాన్ని టేప్ రికార్డర్‌తో రికార్డు చేసుకున్నారట. ఒక ఉపాధ్యాయుడిగా తన అనుభవం ఈ పరిశోధనకు ఎంతగానో సహాయపడిందని ఆయన తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.