విక్టరీ వెంకటేష్ కెరీర్‌కు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాయం ఏంటో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా అరంగేట్రం చేయడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ‘కలియుగ పాండవులు’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్‌కు ఆ అవకాశం ఎలా వచ్చింది? వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర ఏమిటి? డి.రామానాయుడు ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్ ఎలా వెంకటేష్ సినీ జీవితాన్ని మలుపుతిప్పింది? ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.

విక్టరీ వెంకటేష్ కెరీర్‌కు సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాయం ఏంటో తెలుసా..?
Krishna And Venkatesh

Edited By:

Updated on: May 15, 2026 | 3:00 PM

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. ఎటువంటి వివాదాలు లేకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన సినీ ప్రయాణం మొదలైన తీరు చాలా ఆసక్తికరం. 1986లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడుగా కూడా ఎంపికయ్యాడు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ అద్భుతమైన అవకాశం ముందుగా వెంకటేష్ కోసం రాసుకున్నది కాదు.. ఆయన హీరో అవ్వడం వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు.

దానికి దర్శక దిగ్గజం కె. రాఘవేంద్ర రావును దర్శకుడిగా ఎంచుకున్నారు. కథ అంతా సిద్ధమయ్యాక, రామానాయుడు గారు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను ముందుగా అప్పటికే టాలీవుడ్‌ను ఏలుతున్న సూపర్ స్టార్ కృష్ణ గారికి వినిపించారు. ఆ కథ ఆయనకు ఎంతగానో సరిపోతుందని.. ఆ పాత్రకు కృష్ణ గారైతేనే పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని మేకర్స్ బలంగా నమ్మారు. అయితే ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కృష్ణకి కథ నచ్చినప్పటికీ.. అప్పటికే ఆయన చేతినిండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఏమాత్రం సాధ్యం కాకపోవడంతో, ఆయన సున్నితంగా ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది. తనకోసం వేచి చూస్తే సినిమా చాలా ఆలస్యం అవుతుందని కథ నచ్చిన కూడా ఆయన తప్పుకున్నాడు. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణతో రామానాయుడుకి చాలా మంచి అనుబంధం ఉంది.

మరోవైపు రామానాయుడుకి అప్పటివరకు తన కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్‌లను హీరోలుగా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనే ఆలోచన ఏకోశానా లేదు. వారిద్దరినీ గొప్ప వ్యాపారవేత్తలుగా చూడాలన్నదే ఆయన కల. కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ‘కలియుగ పాండవులు’ సినిమాను మరో హీరోతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో రామానాయుడు సన్నిహితులు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. బయటి హీరోల డేట్స్ కోసం వెతికే బదులు.. మీ చిన్న కుమారుడు వెంకటేష్‌ను హీరోగా ఎందుకు పరిచయం చేయకూడదు అని వారు సూచించారు. ఆ సలహా రామానాయుడు గారికి కూడా లాజికల్‌గా అనిపించడంతో.. తన కుమారుడినే లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా ఆ సమయంలో వెంకటేష్ అమెరికాలో MBA చదువుతున్నారు. తండ్రి పిలుపు మేరకు ఆయన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే వెంకటేష్‌ను నేరుగా కెమెరా ముందుకు తీసుకురాకుండా.. ఆయనలో హీరో లక్షణాలను మెరుగుపరచడానికి నటన, డాన్స్, డైలాగ్ డిక్షన్ వంటి విషయాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాతే షూటింగ్ మొదలుపెట్టారు. అలా కృష్ణ కాదనుకున్న ప్రాజెక్ట్.. అనుకోకుండా వెంకటేష్ చేతికి రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు టాలీవుడ్‌కు ‘విక్టరీ’ వెంకటేష్ లాంటి ఒక కంప్లీట్ ఫ్యామిలీ హీరో దొరికారు. ఇండస్ట్రీలో ఏది ఎవరికి రాసి పెట్టి ఉంటే అది జరిగి తీరుతుందనడానికి వెంకటేష్ ఎంట్రీనే పెద్ద ఉదాహరణ.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

Follow Us