
ప్రముఖ తెలుగు నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో శ్రీకాంత్ కు విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా సినిమాలు చేస్తూనే సహాయక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవలే మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీకాంత్ తన సుదీర్ఘ సినీ జీవితంలో హెయిర్ స్టైల్, గెటప్‌ల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలకు ప్రత్యేక గెటప్‌లు మార్చాలనే ఆలోచన లేదని, అన్ని సినిమాలు ఒకే రకంగా కనిపించేవని అన్నారు. ఇప్పుడు సాంకేతికత, మేకప్ విభాగంలో చేంజస్ రావడంతో గెటప్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని, అఖండ వంటి చిత్రాలలో వివిధ గెటప్‌లను ప్రయత్నించానని తెలిపారు. అలాగే, కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ సినిమాలో విలన్‌గా నటించానని, అది ఒక మంచి ఫ్యామిలీ విలన్ పాత్ర అని వివరించారు.
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోగా రాణించిన శ్రీకాంత్, ఇప్పుడు తన కుమారుడు రోషన్ హీరోగా ప్రవేశించిన నేపథ్యంలో తాను విలన్, క్యారెక్టర్ పాత్రలపై దృష్టి సారించినట్లు చెప్పారు. “మనం అద్దంలో చూసుకున్న తర్వాత మనం ఏంటో మనకు తెలిస్తే మనం లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు” అంటూ, హీరోగా కొనసాగడం కన్నా విభిన్నమైన పాత్రలు, యాంటీ హీరో పాత్రలను ఎంచుకోవడం సరదాగా ఉంటుందని, టెన్షన్ లేకుండా జీవించవచ్చని అన్నారు.
ఇండస్ట్రీలో పోటీ గురించి మాట్లాడుతూ, తాను, జగపతి బాబు ఫ్యామిలీ సబ్జెక్టులు చేసుకుంటూ బిజీగా ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర నటులతో తమను పోల్చుకోలేదని, తమకంటూ ఒక ప్రత్యేక జోనర్ ఉందని చెప్పారు. దర్శకులు కృష్ణారెడ్డి ఎక్కువగా తమతోనే సినిమాలు చేసేవారని, తామిద్దరం ఆల్టర్నేట్‌గా సినిమాలు చేసేవాళ్లమని పేర్కొన్నారు. కొన్నిసార్లు డేట్స్ క్లాష్ అవడం వల్ల మంచి సినిమాలు మిస్ అయ్యాయని, ఒకసారి ఒక నిర్మాతను కలిసి “ఈ సినిమా బాగుంటుంది, దీన్ని తర్వాత చేద్దాం” అని చెప్పినా కుదరలేదని, ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. అలాగే తన కెరీర్ లో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో తప్ప మిగతా అందరు హీరోలతో తాను నటించానని శ్రీకాంత్ చెప్పారు. బన్నీ (అల్లు అర్జున్), రామ్ చరణ్ వంటి యువ హీరోలతో కూడా పనిచేశానని, భవిష్యత్తులో మిగిలిన వారితో కూడా నటించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి