
భారత సినిమా చరిత్రలో ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ బోర్ కొట్టావు. మరికొన్ని సినిమాలు అరుదైన రికార్డ్స్ ను సృష్టించి ఎప్పటికీ అలా నిలిచిపోయి ఉంటాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా భారత చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల క్రితమే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమా దెబ్బకు ప్రపంచం మొత్తం తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమాను ఏకంగా 50 దేశాల్లో విడుదల చేశారు. ఆ సినిమా మరేదో కాదు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ మోసగాళ్లకు మోసగాడు. 1971లో విడుదలైన ఈ చిత్రం, భారతదేశంలో రూపొందించబడిన తొలి కౌబాయ్ సినిమాగా, అలాగే ఏకంగా 50 దేశాల్లో విడుదలైన తొలి పాన్ వరల్డ్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్‌లో ఒక సాహసోపేత ప్రయత్నంగా నిలిచిన ఈ సినిమా ఆయన ప్రయోగత్మక ఆలోచనలకు నిదర్శనం.
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు అనేక సాంకేతిక, జానర్ పరమైన ప్రయోగాలను పరిచయం చేసిన ఘనత దక్కింది. తొలి కౌబాయ్ చిత్రంగానే కాకుండా, తొలి జేమ్స్ బాండ్ చిత్రాలను కూడా రూపొందించిన రికార్డు ఆయనదే. 1970వ దశకంలో మద్రాస్‌లో కొన్ని ఆంగ్ల చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించడం చూసి, అలాంటి చిత్రాలను తెలుగులో ఎందుకు తీయకూడదని కృష్ణ ఆలోచించారు. తక్షణమే రచయిత ఆరుద్రను పిలిపించి, హాలీవుడ్ క్లాసిక్ “ది గుడ్, ది బ్యాడ్ అండ్ అగ్లీ” స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చేయమని కోరారు. ఆ కథ కృష్ణకు నచ్చడంతో, తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై సినిమాను నిర్మించడానికి పూనుకున్నారు. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో, కృష్ణ తమ్ముళ్లు హనుమంతరావు, జి. ఆదిశేషగిరి రావులు నిర్మాతలుగా, 1971 ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలైంది.
అప్పట్లో కనీవినీ ఎరుగని రీతిలో 8 లక్షల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రాజస్థాన్‌లో జరిగింది. కృష్ణ హీరోగా, విజయనిర్మల హీరోయిన్‌గా నటించగా, నాగభూషణం, రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా కథ బొబ్బిలి యుద్ధ కాలంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమిందార్లు దాచిన నిధి చుట్టూ తిరుగుతుంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు, గుర్రపు స్వారీ, చేజింగ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోసగాళ్లకు మోసగాడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, 8 లక్షల బడ్జెట్‌తో నిర్మితమై 50 లక్షల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ తర్వాత 50 లక్షల గ్రాస్ సాధించిన మూడవ హీరోగా కృష్ణను నిలబెట్టింది. ఈ సినిమా విజయం తర్వాత హిందీలో ఖజానా, తమిళంలో మోసకారనుక్కు మోసకారన్ పేరుతో డబ్ చేశారు. కృష్ణ మరో ముందడుగు వేసి, సినిమాలోని పాటలు తీసేసి ది ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ లోకి డబ్ చేయించి ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల చేశారు. దాంతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తొలి చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు చరిత్ర సృష్టించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.